ముగిసిన పరీకర్‌ అంత్యక్రియలు

18 Mar, 2019 19:19 IST|Sakshi

పనజి : బీజేపీ సీనియర్‌ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పరీకర్‌(63) అంత్యక్రియలు ముగిశాయి. గోవాలోని మిరామిర్‌ బీచ్‌లో అధికారిక లాంఛనాలతో వేలాది మంది ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రధాని నరేం‍ద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు నేతలు పరీకర్‌ అంత్యక్రియలకు హాజరయ్యారు.

కొత్త సీఎంగా ప్రమోద్‌ సావంత్‌
దేశ రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరొందిన పరీకర్‌ మరణంతో గోవాలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిగా కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ మృదులా సిన్హాకు విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ బీజేపీ సహా మిత్ర పక్షాల ఎమ్మెల్యేలతో సమావేశమైనట్లు సమాచారం. ఈ క్రమంలో గోవా కొత్త సీఎంగా శాసన సభాపతి ప్రమోద్‌ సావంత్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇక మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ) ఎమ్మెల్యే సుదిన్‌ దివాలికర్‌,  గోవా ఫార్వర్డ్‌ పార్టీ ఎమ్మెల్యే విజయ్‌ సర్దేశాయ్‌లకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి గవర్నర్‌ మృదులా సిన్హా వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు