ప్రణబ్‌ ఇక కాంగ్రెస్‌ కీలక సలహాదారా? కూతురి క్లారిటీ

26 Jul, 2017 09:12 IST|Sakshi
ప్రణబ్‌ ఇక కాంగ్రెస్‌ కీలక సలహాదారా? కూతురి క్లారిటీ

న్యూఢిల్లీ: ప్రణబ్‌ ముఖర్జీ భారత రాజకీయాల్లో తలపండిన నేత. సుదీర్ఘ పరిపాలన అనుభవం ఆయనకు మెండుగా ఉంది. దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఆయన ప్రస్తుతం పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఆయన ఏం చేయనున్నారు? తిరిగి కాంగ్రెస్‌ పార్టీకోసం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పనిచేస్తారా? సలహాలు అందిస్తారా? గతంలో మాదిరిగా ఇంటి వద్ద ఉండే కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతారా అని చర్చ మొదలైంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీకి ప్రణబ్ ముఖ్య రాజకీయ సలహాదారుగా వ్యవహరించనున్నారని ఊహాగానాలు బయలుదేరాయి.

కాంగ్రెస్‌ పార్టీ నేత మణి శంకర్‌ అయ్యర్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ ముఖర్జీ కాంగ్రెస్‌ పార్టీకి సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తారని ఆశిస్తున్నానని అయితే, ఈ విషయంలో తనకు కూడా స్పష్టంగా తెలియదని వ్యాఖ్యానించినప్పటి నుంచి ఈ చర్చ మొదలైంది. అయితే, వీటికి ప్రణబ్‌ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముగింపు పలికారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తన తండ్రి ఒక రారని అన్నారు. 'ఒకసారి రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టాక ఆయన రాజకీయాలకు అతీతంగా వెళ్లారు. గొప్ప రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న మా నాన్న గొప్ప నిధిలాంటివారు. అయితే, ఏ పార్టీలోని ఏ నేత అయినా ఆయన అనుభవం నుంచి పాఠాలు కావాలంటే కచ్చితంగా సహాయం చేస్తారు. అయితే, ఇది ఏ ఒక్క పార్టీకో కాదు.. అన్ని పార్టీలకు వర్తిస్తుంది. గతంలో కూడా పలువురికి ఆయన సలహా ఇచ్చారు. అందుకే ఆయనను అన్ని పార్టీల వాళ్లు గౌరవిస్తారు' అని చెప్పారు.

మరిన్ని వార్తలు