నోట్ల రద్దుతో ఆర్థిక మందగమనం

6 Jan, 2017 03:05 IST|Sakshi
నోట్ల రద్దుతో ఆర్థిక మందగమనం

పేదల కష్టాలపై తక్షణం దృష్టిపెట్టాలన్న రాష్ట్రపతి
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంతో తాత్కాలికంగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు అనంతరం తలెత్తిన ఇక్కట్ల నేపథ్యంలో పేదలు ఎక్కువ సమయం వేచి ఉండలేరని, వారికి తక్షణ సాయం అందాల్సిన అవసరముందన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రణబ్‌ ప్రసంగించారు. ‘నల్లధనం, అవినీతిపై పోరాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయంతో పేదలు ఇబ్బంది పడకుండా అదనపు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

దీర్ఘకాలంలో ఆశించిన అభివృద్ధి కోసం ఇది తప్పనిసరి. అప్పుడే ఆకలి, నిరుద్యోగం, దోపిడీ నిర్మూలన కోసం సాగుతున్న ప్రయాణంలో వారు క్రియాశీల భాగస్వాములు కాగలరు’ అని చెప్పారు. పేదరిక నిర్మూలనకు తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల్ని అభినందిస్తున్నానని, అయితే ఫలితాలు దక్కేందుకు పేదలు ఇంకెంత కాలం వేచి ఉండాలో స్పష్టం గా చేప్పలేనన్నారు. దీర్ఘకాల లాభాల కోసం తాత్కాలిక ఇబ్బందులు తప్పవన్నారు. ఇటీవల పేదల కోసం ప్రధాని ప్రకటించిన ప్యాకే జీ వారికి కొంత ఉపశమనం కలిగిస్తుందన్నారు. అనేక యూనివర్సిటీలకు చాన్సలర్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్లు... ఉన్నత విద్య ప్రమాణాల మెరుగుదల కోసం విద్యా రంగ నిపుణులతో కలిసి పనిచేయాలన్నారు.

మరిన్ని వార్తలు