లోక్‌సభ సీట్లను వెయ్యికి పెంచాలి

17 Dec, 2019 00:23 IST|Sakshi

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 

న్యూఢిల్లీ: భారత్‌లోని జనాభాను పరిగణనలోకి తీసుకుంటే పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ సీట్లకు ప్రస్తుతమున్న 543 నుంచి 1000కి, అదే శాతంలో రాజ్యసభ సీట్లను పెంచాలని ప్రణబ్‌ సూచించారు. ఒక్కో సభ్యుడు ప్రాతినిధ్యం వహించే జనాభా సంఖ్యలోనూ ప్రస్తుతం చాలా తేడా ఉందన్నారు. ఒక్కో లోక్‌సభ సభ్యుడు 16 నుంచి 18 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, వారందరికి ఆయనొక్కడు ఎలా అందుబాటులో ఉండగలడని ప్రశ్నించారు. ‘1971 జనాభా లెక్కల ఆధారంగా చివరగా 1977లో లోక్‌సభ సభ్యుల సంఖ్యను సవరించాం. అప్పటి జనాభా 55 కోట్లు. ప్రస్తుత జనాభా అందుకు రెండింతలు. అందువల్ల లోక్‌సభ సభ్యుల సంఖ్యను కూడా కనీసం 1000 చేయాలి’ అన్నారు.

ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో.. ‘భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయవంతమైందా? ముందున్న సవాళ్లేంటి’ అనే అంశంపై సోమవారం అటల్‌ బిహారీ వాజ్‌పేయి సంస్మరణ ప్రసంగాన్ని ప్రణబ్‌ వెలువరించారు. ఈ సందర్భంగా ఓటరు ఇచ్చే తీర్పును పార్టీలు సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. ‘ప్రజలు సంఖ్యారూపంలో ఆధిక్యత ఇచ్చి ఉండొచ్చు. కానీ దేశంలోని మెజారిటీ ఓటర్లు ఒకే పార్టీకి మద్దతివ్వడం ఎప్పుడూ జరగలేదు. అందువల్ల అధికారంలో ఉన్న పార్టీలు ఈ ఆధిక్యతావాదంపై జాగ్రత్త వహించాలి’ అని సూచించారు. ‘భారతీయ ఓటర్లు ఇచ్చే తీర్పును రాజకీయ పార్టీలెప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు.

అందువల్ల అఖండ మెజారిటీ రాగానే ఏమైనా చేయొచ్చని భావిస్తాం. అలా వ్యవహరించిన పార్టీలకు ఆ తరువాత అదే ఓటర్లు శిక్ష విధించిన సందర్భాలు చాలా ఉన్నాయి’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు మీకు సంఖ్యాత్మక మెజారిటీ ఇచ్చారంటే దానర్థం వారు సుస్థిర ప్రభుత్వం కోరుకుంటున్నారు. అలాగే, మెజారిటీ ఓటర్లు మీకు మద్దతివ్వలేదంటే.. వారు ఆధిక్యతావాద ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదు అని అర్థం. అదే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇచ్చే సందేశం’ అని ప్రణబ్‌ విశ్లేషించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ఒకసారి సాధ్యమవుతుందేమో కానీ,  ప్రతీసారీ సాధ్యం కాదని ప్రణబ్‌ పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు