ప్రణబే ప్రధాని కావాల్సింది

14 Oct, 2017 03:37 IST|Sakshi

అందుకు అన్ని అర్హతలున్నాయి

పదవి దక్కనందుకు ఆయన చింతించే ఉంటారు

‘కొలిషన్‌ ఇయర్స్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మన్మోహన్‌

న్యూఢిల్లీ:  ప్రధాని అయ్యేందుకు తనకన్నా, నాటి తన మంత్రివర్గ సహచరుడు ప్రణబ్‌ ముఖర్జీకే ఎక్కువ అర్హతలు ఉన్నాయని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. 2004లో తాను ప్రధాని పదవి చేపట్టిన నాటి ఘటనలను గుర్తుచేసుకుంటూ మన్మోహన్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘2004లో ప్రధానిగా సోనియాజీ నన్ను ఎంపిక చేసుకున్నప్పుడు.. ప్రణబ్‌ ముఖర్జీ కచ్చితంగా బాధపడే ఉంటారు.

అలా బాధపడటం తప్పేంకాదు.. ఎందుకంటే నా కన్నా ప్రధాని పదవి చేపట్టేందుకు ఆయనకే ఎక్కువ అర్హత ఉంది.. అయితే, నేను ప్రధాని కావడంలో నా ప్రమేయమేమీ లేదని తనకూ తెలుసు’ అని మన్మోహన్‌ సింగ్‌ నవ్వుతూ పేర్కొన్నారు. రాష్ట్రపతిగానే కాకుండా, కేంద్రంలో పలు కీలక పదవులు సమర్ధవంతంగా నిర్వహించిన ప్రణబ్‌ ముఖర్జీ రాసిన ‘కొలిషన్‌ ఈయర్స్‌(సంకీర్ణ సంవత్సరాలు)’ పుస్తకావిష్కరణ సభలో మన్మోహన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఆ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. సహా ఆహూతులందరినీ ఒక్కసారిగా నవ్వుల్తో ముంచెత్తాయి.

ప్రధానిగా తానున్న సమయంలో అత్యంత సమర్ధ సహచరుడు ప్రణబ్‌ ముఖర్జీనేనని ఈ సందర్భంగా మన్మోహన్‌ ప్రశంసించారు. తమ మధ్య నెలకొన్న సత్సంబంధాలతోనే ప్రభుత్వాన్ని సజావుగా నడిపామని పేర్కొన్నారు. ప్రణబ్‌ అత్యంత గౌరవనీయమైన పార్లమెంటేరియన్, కాంగ్రెస్‌ నాయకుడని వర్ణించిన మన్మోహన్‌...ఆయన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎప్పుడు సమస్యలు తలెత్తినా ప్రణబ్‌ వైపే చూసేవాళ్లమని గుర్తుచేశారు. ప్రణబ్‌ ఉద్దేశపూర్వకంగానే రాజకీయాల్లోకి రాగా, తాను మాత్రం మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కోరగా అనుకోకుండా రాజకీయ నాయకుడినయ్యాయని అన్నారు.

నేనే ప్రధాని అనుకున్నారు: ప్రణబ్‌
2004 ఎన్నికల తరువాత ప్రధాని పదవిని చేపట్టడానికి సోనియా నిరాకరించడంతో తానే తదుపరి ప్రధాని అని అందరూ అనుకున్నారని ప్రణబ్‌ ఆ పుస్తకంలో రాశారు. ప్రధాని పదవి చేపట్టేందుకు సోనియా నిరాకరించాక అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.. పార్టీలో, పాలనలో అనుభవం ఉన్న రాజకీయ నేతనే ప్రధాని కావాలని కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం ఏర్పడిందని వెల్లడించారు. దాంతో, ఆ అర్హతలన్నీ ఉన్న తానే తదుపరి ప్రధాని అని అంతా అనుకున్నారన్నారు.  మన్మోహన్‌ ప్రభుత్వంలో చేరడానికి తాను అయిష్టత వ్యక్తం చేస్తే సోనియా బలవంతం చేశారని ప్రణబ్‌ గుర్తు చేసుకున్నారు.  అనేక అభిప్రాయాలకు వేదిక అయిన కాంగ్రెస్‌ పార్టీయే ఓ సంకీర్ణమని.. అందువల్ల పార్టీలో ఒక సంకీర్ణం, ప్రభుత్వంలో మరొకటి ఉండటం అసాధ్యమవుతుందని భావించామని.. కానీ యూపీఏ హయాంలో అది సాధ్యమైందని ప్రణబ్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు