సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రాంజల్‌ పాటిల్‌

14 Oct, 2019 14:51 IST|Sakshi

తిరువనంతపురం : ప్రాంజల్‌ పాటిల్‌ తిరువనంతపురం జిల్లా సబ్‌ కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలకగా, అభినందనలు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ కే గోపాలకృష్ణన్, కలెక్టరేట్ సిబ్బంది సమక్షంలో ప్రాంజల్‌ సబ్ కలెక్టర్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా చూపు లేకున్నా ప్రాంజల్‌ పాటిల్‌ తొలి ప్రయత్నంలోనే ఆల్‌ ఇండియా 773 ర్యాంక్‌ సాధించారు. ప్రాంజల్‌ కంటిచూపు లేని తొలి భారతీయ మహిళా ఐఎఎస్‌ అధికారి కావడం గమనార్హం.

ప్రాంజల్‌ పాటిల్‌కు ఆరేళ్ల వయసులో  తరగతి గదిలో సహ విద‍్యార్థి  పొరపాటున పెన్సిల్‌తో  కంట్లో గుచ్చాడు. దాంతో ఆ కన్ను చూపు కోల్పోగా, ఆ గాయం తాలూకు ఇన్‌ఫెక్షన్ రెండో కన్నుకీ సోకింది. నెమ్మదిగా ఆ కన్ను చూపు కూడా కోల్పోయింది. అయితే ప్రాంజల్‌  అమ్మానాన్న మాత్రం ఆమెను ఎన్నడూ అంధురాలిగా చూడలేదు. జీవితం పట్ల ఓ దృక్ఫదంతో పాటు కలలు కనేలాగానే పెంచారు.  దాదర్‌లోని కమలా మెహతా స్కూల్ ఫర్ బ్లైండ్‌లో పాఠశాల విద్య, చండీబాయి కాలేజ్‌లో ఇంటర్ చేసింది. 2015లో ఎమ్‌ఫిల్ చేస్తూ ఐఏఎస్‌కి ప్రిపరేషన్ మొదలుపెట్టిన ప్రాంజల్‌ తల్లిదండ్రులు, స్నేహితుల సాయంతో తాను ఐఏఎస్‌ కావాలనే కలను సాకారం చేసుకున్నారు.


 

మరిన్ని వార్తలు