ఆరోజే బిగ్‌ అనౌన్స్‌మెంట్‌: ప్రశాంత్‌ కిషోర్‌

13 Feb, 2020 16:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్‌ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ ఏ పార్టీతో జట్టుకట్టినా విజయం వారిని వరిస్తుందని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మూడోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి పీకే రచించిన వ్యూహాలు పక్కాగా పనిచేశాయి. ఫలితంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికలకు ముందు బిహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలు పీకే రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తించాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌పీఆర్‌)పై ప్రశాంత్‌కిషోర్‌ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జేడీయూ వాటికి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ వైఖరిని ప్రశ్నించినందుకు జేడీయూ ఉపాధ్యక్షుడుగా ఉన్న పీకేను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఆయనపై వేటు పడింది.( ఆరోజు.. అక్కడే మాట్లాడతా: ప్రశాంత్‌ కిషోర్‌)

ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం.. ఈ విషయాల గురించి మాట్లాడతానని పీకే గతంలో ఓ ప్రకటన చేశారు. అయితే ఫిబ్రవరి 11న రిజల్ట్స్‌ వచ్చినప్పటికీ.. బిహార్‌ రాజకీయాల గురించి ఆయన ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు. దీంతో రాజకీయ భవిష్యత్తు గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన పీకే.. ‘ఫిబ్రవరి 11 తర్వాత అందరూ కీలక ప్రకటన(బిగ్‌ అనౌన్స్‌మెంట్‌) గురించి ఎదురుచూశారు. అయితే ఫిబ్రవరి 18న ఆ విషయం గురించి మాట్లాడబోతున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేం‍ద్ర మోదీ(బీజేపీ) ప్రధానిగా గెలుపొందడం, నితీష్‌ కుమార్‌(జేడీయూ) బిహార్‌ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం వెనక ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు కీలకంగా పని చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం మమతా బెనర్జీ.. పీకే టీంతో జట్టుకట్టారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన ఐప్యాక్ బృందం.. దీదీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తోంది. (పీకే.. పక్కా వ్యూహకర్త)

మరిన్ని వార్తలు