'చేపల వేట ప్రోత్సాహానికి ఆర్థిక సాయం'

22 Nov, 2019 19:16 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నీలి విప్లవం పథకం కింద సముద్ర జలాల్లో చేపల వేటను ప్రోత్సహించడానికి పలు విధాలుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మత్స్య శాఖ సహాయ మంత్రి  ప్రతాప్‌ చంద్ర సారంగి తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నీలి విప్లవం పథకం కింద సాంప్రదాయక చేపల పడవలను ఆధునీకరించుకోవడానికి, మత్స్యకారులకు సేఫ్టీ కిట్స్‌ పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.

ఫైబర్‌ గ్లాస్‌ ప్లాస్టిక్‌ బోట్లు, ఇన్సులేటెడ్‌ ఐస్‌ బాక్స్‌లు సమకూర్చుకోవడానికి ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. మత్స్యకారులు సముద్ర జలాల్లో సుదూరంగా  వేటను కొనసాగించడానికి ట్రాలర్లను లాంగ్‌ లైనర్స్‌ కింద మార్చుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేట సామర్ధ్యం తగ్గ లేదని, 2017-18లో మొత్తం మత్స్య సంపదలో 70 శాతం వరకు వేటాడినట్లు  మంత్రి వివరించారు.

అయితే దేశంలో వివిధ కేటగిరీలకు చెందిన 2.6 లక్షల బోట్లు చేపల వేట సాగిస్తున్నట్లు తెలిపారు. దేశానికి చెందిన సముద్ర జలాల్లో మొత్తం 5.31 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల మత్స్య సంపద ఉన్నట్లుగా అంచనా వేశామని తెలిపారు. తీర ప్రాంత భద్రతను పటిష్టపరచేందుకు ఏర్పాటైన జాతీయ కమిటీ సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్ళే మత్స్యకారుల భద్రతకు సంబంధించినన వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు