పెళ్లికూతురి ముస్తాబులో ప్రత్యూష అంత్యక్రియలు

3 Apr, 2016 12:01 IST|Sakshi
పెళ్లికూతురి ముస్తాబులో ప్రత్యూష అంత్యక్రియలు

ముంబై : చివరి ప్రయాణంలో ప్రత్యూష బెనర్జీ(24)ని పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి కడసారి వీడ్కోలు పలికారు. శనివారం అశ్రునయనాల మధ్య ముంబైలోని ఓ శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.  త్వరలోనే తనకు పెళ్లి దుస్తులు రూపొందించాల్సిందిగా డిజైనర్ అయిన స్నేహితుడు రోహిత్ వర్మను ప్రత్యూష ఇటీవలే కోరడం.. ఇంతలోనే ఆమె అర్థాంతరంగా తనువు చాలించడం కుటుంబసభ్యులతోపాటు స్నేహితులను తీవ్రంగా కలచివేసింది. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా ప్రేక్షకులకు ఆనందిగా సుపరిచితురాలైన ప్రత్యూష బెనర్జీ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

కుమార్తె మృతి విషయమై తల్లి డాలీ బింద్రా మట్లాడుతూ.. ముందు ఓ టీవీ చానెల్ నుంచి ప్రత్యూష గురించి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఏప్రిల్ ఫూల్ చేయడానికి చెబుతున్నారని భావించానని, వినోదం కోసం ఇలాంటి పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారా అంటూ వారిపై కోప్పడ్డానని తెలిపారు. కానీ ఆ తర్వాత నిజంగానే ప్రత్యూష ఇక లేదని తెలిశాక షాక్కు గురయ్యామన్నారు. రాహుల్తో ప్రేమ విషయం తమకు తెలిపిందని, వివాహానికి తమ అనుమతి కూడా కోరిందని ఆమె చెప్పారు.

ప్రత్యూష మృతిపై చాలా అనుమానాలున్నాయని డాలీ చెబుతున్నారు. ప్రత్యూష కళ్లు ప్రశాంతంగా ఉండటం, నుదుటి మీద తాజా సింధూరం కనబడటం.. ఆమెది ఆత్మహత్యలా అనిపించడం లేదన్నారు. ఏదేమైనా రాహుల్ తమ కుమార్తె మృతి విషయంలో తప్పక సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. ఆమె మృతదేహాన్ని పరిశీలించినప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తాయని, పోలీసులకు ప్రతి విషయం తెలియజేశామని ఆమె తెలిపారు. నిజం తప్పక బయటపడుతుందని.. అప్పటివరకు ఓపికగా ఉంటామని ప్రత్యూష తల్లి అన్నారు.

మరిన్ని వార్తలు