అవి రాజకీయ దాడులే..

9 Apr, 2019 08:29 IST|Sakshi

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాధ్‌కు ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్డీ) ప్రవీణ్‌ కక్కర్‌ తన నివాసాలు, కార్యాలయాలపై రెండు రోజులు జరిగిన ఐటీ దాడులు రాజకీయ కోణంలో జరిగనవేనని పేర్కొన్నారు. ఆదాయ పన్ను అధికారులు రెండు రోజుల పాటు సాగించిన దాడులు, సోదాల్లో వారు ఎలాంటి పత్రాలను సీజ్‌ చేయలేదని, నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోలేదని చెప్పారు.

ఈ దాడులను ఆయన పూర్తిగా పొలిటికల్‌ ఆపరేషన్‌గా అభివర్ణించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందం ఇండోర్‌లోని కక్కర్‌ నివాసాలతో పాటు కమల్‌నాధ్‌కు మాజీ సలహాదారు ఆర్‌కే మిగ్లానీ ఢిల్లీ నివాసంపై ఆదివారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు ఇండోర్‌, భోపాల్‌, గోవా, ఢిల్లీ వంటి పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు దాడులు నిర్వహించారు. కాగా, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన సోదాల్లో రూ.281 కోట్ల విలువైన నగదును అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించామని ఐటీ అధికారులు చెప్పారు. ఈ నిధుల్ని సేకరించేందుకు విస్తృతంగా వ్యవస్థీకృత రాకెట్‌ ఒకటి నడుస్తోందని తెలిపారు. ఆదివారం నాటి దాడుల్లో లెక్కల్లో చూపని రూ.14.6 కోట్ల నగదు, మధ్యప్రదేశ్‌–ఢిల్లీ మధ్య జరిగిన అనుమానిత లావాదేవీలకు సంబంధించిన కంప్యూటర్‌ ఫైల్స్‌ను జప్తు చేసినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు