భయపడొద్దు.. జాగ్రత్తగా ఉంటే చాలూ!

26 May, 2018 15:22 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం: కేరళను వణికించిన నిపా వైరస్‌ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు వదంతులను నమ్మొద్దంటూ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్‌ వ్యాప్తి కాకుండా జాగ్రత్త పడొచ్చని చెబుతున్నారు. 

నిపా వైరస్‌ జూనోటిక్‌ వ్యాధికి సంబంధించింది. అంటే జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించేది. ఇన్ఫెక్షన్ సోకిన పందులు, గబ్బిలాలు, వాటి విసర్జితాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ సోకిన వారి నుంచి కూడా ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందన్నది వైద్యుల మాట. ఈ వైరస్ సోకినవారికి దగ్గరగా వెళ్లినప్పుడు లేదా వైరస్‌ సోకిన వారు ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయడం వల్ల వ్యాధి విస్తరిస్తుందని చెబుతున్నారు. కోచిలోని అమ్రిత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్లినికల్ ప్రొఫెసర్ విద్యామీనన్.. నిపా గురించి పలు సూచనలు చేస్తున్నారు.  

‘మలేషియాలో పందుల పెంపకందార్లలో మొదటిసారిగా ఈ వైరస్‌ సోకగా, నిపా వెలుగులోకి వచ్చింది. భారత్‌లోనూ 2001, 2007లో పశ్చిమబెంగాల్ సిలిగురి ప్రాంతంలోనూ నిపా వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి తీరుతెన్నులను గమనిస్తే ఒకే ప్రాంతం, దాని చుట్టుపక్కల పరిసరాలకు పరిమితమవుతూ వస్తోంది. ప్రస్తుతం కూడా కేరళలోని కోజికోడ్, మళప్పురం, కన్నూర్, వేనాడ్ జిల్లాలకే నిపా పరిమితమైంది. దేశంలో మరెక్కడ దీని ఆనవాళ్లు లేదన్న సమాచారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశమే లేదు’ అని విద్యామీనన్‌ సలహా ఇస్తున్నారు.

- చేతులను తరచుగా సోప్ తో శుభ్రం చేసుకోవటం. 
- ఆహారాన్ని పూర్తిగా ఉడికించి తినడం
- పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత తినడం... ప్రాథమిక జాగ్రత్తలుగా ఆయన చెబుతున్నారు.
- శ్వాసకోస ఇన్ఫెక్షన్, జ్వరం, వళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడం కష్టం కావడం, దగ్గు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవటం  ఉత్తమం. వ్యాధి నిర్ధారణ అయితే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని వైద్యసిబ్బందికి సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు