ఆస్పత్రులు కాదన్నాయి: ఆటో దిక్కైంది!

14 May, 2020 14:44 IST|Sakshi
సంగీత పాల్

ముంబై : కరోనా వైరస్‌ భయం కారణంగా కాన్పు చేయటానికి ఆస్పత్రులు వెనకాడటంతో ఆటోలో పాపకు జన్మనిచ్చిందో మహిళ. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబై మలద్‌కు చెందిన 29 ఏళ్ల గర్బిణి సంగీత పాల్‌కు బుధవారం ఉదయం నొప్పులు మొదలయ్యాయి. దీంతో  భర్త అచంచల్‌ ఆటోలో ఆమెను గోవింద్‌ నగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే కరోనా వైరస్‌ కారణంగా కాన్పు చేయటానికి సదరు ఆసుపత్రి వైద్యులు వెనకడుగు వేశారు. జుహులోని కూపర్‌ ఆసుపత్రికి వెళ్లవల్సిందిగా సలహా ఇచ్చారు. అచంచల్‌ ఆ వెంటనే ఆమెను కూపర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. ( వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు )

దానికి తోడు సంగీత పరిస్థితి దిగజారుతుండటంతో ఆటోలోనే ఆమెకు కాన్పు చేయాలని అచంచల్ నిశ్చయించుకున్నాడు. పొరుగింటి మహిళ, ఓ నర్సు సహాయంతో ఆటోలోనే కాన్పు చేయించాడు. సంగీత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను దగ్గరిలోని సావంత్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు బొడ్డు తాడును కోసి, వారికి వైద్యం అందించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు