వైరల్‌ వీడియో: గర్భిణిని నది దాటించడం కోసం..

10 Aug, 2019 19:10 IST|Sakshi

తిరువనంతపురుం: భారీ వర్షాలు కేరళను అతలాకుతలం​ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు భారీ వరదలు.. మరోవైపు కొండ చరియలు విరిగిపడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం హై అలర్ట్‌ని ప్రకటించింది. ఈ క్రమంలో తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం కోసం రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. వరదల కారణంగా పాలక్కడ్‌ జిల్లాలోని భవానీ నది ఉగ్రరూపం దాల్చింది. నది ఒడ్డున ఉన్న ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. దాంతో ఆ ఇళ్లలో ఉన్న వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది  చేసిన ఓ సాహసం ఔరా అనిపిస్తుంది.

సహాయక చర్యల్లో భాగంగా భవాని నది ప్రాంతంలో ఉంటున్న ఓ కుటుంబాన్ని తీరం దాటించడం రెస్క్యూ టీమ్‌కు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్లు, ఓ ఎనిమిది నెలల గర్భిణి, ఒకటిన్నర ఏళ్ల చిన్నారి ఉన్నారు. వీరిని సురక్షిత ప్రాంతానికి చేర్చడం నిజంగా సవాలు లాంటిదే. అయితే సహాయక బృందాలు ముసలి వారిని క్షేమంగానే నది దాటించగలిగారు. కానీ గర్భిణిని, ఆమె కొడుకును నది దాటించడం పెద్ద సమస్యగా మారింది. దాంతో గర్భిణిని తాళ్లు, బెల్టు సాయంతో తాడుకు వెళ్లాడదీసి క్షేమంగా నదిని దాటించారు. అలానే ఆ చిన్నారిని నది దాటించడం కోసం ఓ రెస్క్యూ టీం మెంబర్‌ను కూడా తాళ్లు, బెల్టు సాయంతో కట్టి.. బాలుడిని అతడి ఒడిలో కూర్చొపెట్టి సురక్షితంగా నదిని దాటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రెస్క్యూ టీం సమయస్ఫూర్తిని తెగ అభినందిస్తున్నారు నెటిజనులు.
 

>
మరిన్ని వార్తలు