ఆమె వేదన.. అరణ్య రోదన.!

23 Aug, 2017 14:12 IST|Sakshi
ఆమె వేదన.. అరణ్య రోదన.!
► మంటగలిసిన మానవత్వం
► నిస్సహాయ స్థితిలో ప్రసవించిన అభాగ్యురాలు
► కులజాడ్యంతో సహాయానికి రాని గ్రామస్తులు, బంధువులు
 
సాటి మనుషులు, బంధువులే ఆమె పరిస్థితిని చూసి చలించకపోతే.. ఆ అభాగ్యురాలి ఆవేదన ఏ దూరతీరాలకు చేరగలదు. ఆ దీనురాలు ఏ భగవంతునికి నివేదించు కోగలదు. మానవత్వం మంట గలిసిన సమాజంలో కన్నీటి బాధను పంటి బిగువున భరించడం తప్ప ఆమె సమాజాన్ని ఏమని ప్రశ్నించగలదు. ప్రసవ వేదన అనుభవిస్తున్న ఓ యువతి ఎంత వేడుకున్నా ఏ ఒక్కరూ సాయమందించక పోవడంతో చివరికి ఆమె ఏం చేసిందంటే..  
 
జయపురం, మల్కన్‌గిరి(ఒడిశా): మానవులందరి జననం ఒకటే అయితే.. కొంతమంది తమ స్వార్థం కోసం మతాలు, కులాలు, జాతులు, సృష్టించి మానవజాతిని ముక్కముక్కలుగా విభజించారు. ఆ జాడ్యం నేడు సమాజంలో మానవత్వాన్ని మంటగలుపుతోంది.  అటువంటి సంఘటనే సోమవారం సాయంత్రం కొరాపుట్‌ జిల్లాలోని మత్తిలి సమితిలో జరిగింది. రెండు కులాలకు చెందిన ప్రేమికుల జంటను గ్రామస్తులు ఊరినుంచి వెలివేసి సహాయ నిరాకరణ అమలు చేయడంతో నిండు గర్భిణి అయిన యువతి పురిటినొప్పులకు ఓర్వలేక సహాయం కోసం హృదయవిదారకంగా ఏడ్చినా ఆమె గోడును  గ్రామస్తులు, బంధువులు పట్టించుకోలేదు. ఆమె ఆర్తనాదాన్ని విన్నప్పటికీ తమను కూడా వెలివేస్తారన్న భయంతో సాయం చేసేందుకు  ధైర్యం చేయలేదు.  చివరికి ఆ యువతి ప్రసవనొప్పులు తాళలేక సమీప అడవిలోకి పరుగులు తీసింది. ఎట్టకేలకు ఆ అడవిలోనే కవల పిల్లలను ప్రసవించింది.  ఆఖరికి బిడ్డలు బొడ్డులు కోసేందుకు కూడా ఎవరూ దరి చేరలేదు.  ఈ అమానుష సంఘటన అవిభక్త కొరాపుట్‌ జిల్లా మత్తిలి సమితి దొలపొడిగుడ పంచాయతీ కెందుగుడ గ్రామంలో జరిగింది.
 
ఊరికి దూరంగా బతికిన ప్రేమికులు
గ్రామానికి చెందిన త్రిలోచన హరిజన్‌ అనే యువకుడు  రెండేళ్ల కిందట  మత్తిలిలోని కమరవీధికి చెందిన రతన్‌కమార్‌ కుమార్తె గౌరీకమార్‌ (19)తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే వారిద్దరివీ వేర్వేరు కులాలు కావడం వల్ల  గౌరి తమ కులం కన్నా తక్కువ కులానికి చెందినదని భావించిన త్రిలోచన హరిజన్‌ తల్లిదండ్రులు, ఆ గ్రామస్తులు వారి వివాహాన్ని అంగీకరించలేదు. అంతేకాకుండా ఆ ప్రేమికుల జంటను ఊరినుంచి వెలివేశారు. వారితో కలవకూడదని ఎటువంటి సహాయం చేయకూడదని ఆలా చేసిన వారికి కూడా అదేగతి పడుతుందని గ్రామ ప్రజలను హెచ్చరించారు. కులం కన్నా  తమ ప్రేమ గొప్పదని..ప్రేమను బతికించుకుని  కలిసి జీవిస్తామన్న పట్టుదలతో ఆ ప్రేమ జంట  ఊరికి దూరంగా ఒక పాక వేసుకుని అందులో  కాపురం పెట్టారు. కాలం గడుస్తోంది. గౌరి గర్భం దాల్చింది. గర్భిణిగా ఆమె ఎటువంటి సౌకర్యాలకు నోచుకోలేదు. బిడ్డను కంటానన్న తృప్తి, పట్టుదల ఆమెలో ఉండేది. నవమాసాలు నిండాయి.

సోమవారం మధ్యాహ్నం ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. తన ప్రసవానికి సమయం అయిందని ఆమె గ్రహించింది.అటువంటి సమయంలో ఎవరో ఒకరైనా తనకు సహాయం ఉండాలన్న ఆశ ఆమెలో పొడసూపింది. కానీ వెలికి గురైన ఆమెకు ఎవరు సహకరిస్తారు? సోమవారం సాయంత్రం  ఆమెకు నొప్పులు ఎక్కవయ్యాయి. ఆ సమయంలో భర్త ఇంటిలో లేడు,  కూలి పనులకు బయటకు వెళ్లాడు. సహాయం అర్ధించేందుకు రోడ్డుపైకి వచ్చి తనకు సహాయం చేయండని  కనిపించిన కెందుగుడ గ్రామ ప్రజలను వేడుకుంది. బతిమాలింది. విలపించింది.   అర్ధించింది. అయినా ఎవరి మనసూ కరగలేదు. ఆమె పడుతున్న ప్రసవ వేదన  చూసిన కొంతమందికి సహాయం చేయాలని ఉన్నా వెలివేత భయం వారి మానవత్వాన్ని మంట గలిపింది. చివరికి ఎవరి సహాయం అందకపోవడంతో ఆమె సమీప అడవిలోకి వెళ్లింది. అప్పటికే నొప్పులు తీవ్రమయ్యాయి ఇక భరించలేని ఆమె అడవిలో ఓ వస్త్రం పరిచి దానిపై పడిపోయి అతికష్టంపై ప్రసవించింది. 
 
ఆస్పత్రిలో కోలుకుంటున్న తల్లీబిడ్డలు
అంత బాధలోనూ ఆమె ఇద్దరు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే బిడ్డల  బొడ్డు కోసేందుకు ఎవరూ లేరు. అలా ఆమె మూడు గంటల పాçటు అడవిలో పసికందులతో  నిస్సహాయ స్థితిలో పడి ఉంది. ఈ విషయం తెలిసిన కెందుగుడ గ్రామంలోని ఆశావర్కర్‌ విజయ లక్ష్మి త్రిపాఠి హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పిల్లల బొడ్డు కోసి అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా 108 అంబులెన్స్‌ వచ్చి గౌరిని, బిడ్డలను  మత్తిలి  ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో తల్లీబిడ్డలు కోలుకుంటున్నారు. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. 
మరిన్ని వార్తలు