పీఎస్‌ఎల్‌వీ సీ34 ప్రయోగానికి ఏర్పాట్లు

16 Jun, 2016 04:23 IST|Sakshi

- నేడు వ్యాబ్ నుంచి ప్రయోగవేదిక మీదకు రాకెట్
-18న సాయంత్రం 6 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం
- 20న ఉదయం 9.30 గంటలకు నింగిలోకి
 
 శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మొట్ట మొదటిసారిగా, ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 22 ఉపగ్రహాల ప్రయోగానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 20న ఉదయం 9.30 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మంగళవారం రాకెట్ శిఖరభాగాన 1,288 కిలోల బరువున్న 22 ఉపగ్రహాలను అనుసంధానం చేసే ప్రక్రియను పూర్తిచేసి హీట్‌షీల్డ్ క్లోజ్ చేశారు. బుధవారం లెవెల్-2 తనిఖీలు పూర్తి చేసి అంతా సక్రమంగా ఉండడంతో గురువారం రాకెట్‌ను వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్) నుంచి హుంబ్లీకల్ టవర్(ప్రయోగవేదిక)కు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం మిషన్ సంసిద్ధతా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం లాంఛ్ ఆథరైజేషన్ బోర్డుకు ప్రయోగ పనులను అప్పగించనున్నారు. బోర్డు వారు లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి 18న సాయంత్రం 6 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభిస్తారు. ఆ తరువాత 20న ఉదయం 9.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ34 రాకెట్ ద్వారా 22 ఉపగ్రహాలను సూర్యానువర్తన ధ్రువ కక్ష్య (సన్ సింక్రోనస్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టనున్నారు.

 రాకెట్‌లో 22 ఉపగ్రహాలివే..
 పీఎస్‌ఎల్‌వీ సీ34 రాకెట్ ద్వారా 22 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఇందులో 19 విదేశీ, మూడు స్వదేశీ ఉపగ్రహాలు. స్వదేశీ ఉపగ్రహాల్లో కార్టోశాట్-2సీ(727.5 కిలోలు), చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ విద్యార్థులు తయారుచేసిన సత్యభామశాట్(1.5 కిలోలు), పుణె యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన స్వయంశాట్(1 కిలో) ఉన్నాయి. వాణిజ్యపరంగా ఇండోనేసియాకు చెందిన లపాన్-ఏ3(120 కిలోలు), జర్మనీకి చెందిన బిరోస్(130 కిలోలు), కెనడాకు చెందిన ఎం3ఎంశాట్(85 కిలోలు), జీహెచ్‌జీశాట్-డీ( 25.5 కిలోలు), యూఎస్‌కు చెందిన స్కైశాట్-జెన్2-1(110 కిలోలు) ఉపగ్రహాలతో పాటు యూఎస్‌కే చెందిన 5 కిలోలు బరువు ఉన్న 12 బుల్లి తరహా ఉపగ్రహాలను (డౌవ్‌శాటిలైట్స్) రోదసీలోకి పంపేందుకు అంతా సిద్ధం చేశారు. ఇస్రో వాణిజ్యపరంగా ఇప్పటివరకూ 57 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ రాకెట్లు ద్వారానే ప్రయోగించింది.

>
మరిన్ని వార్తలు