బిల్లులో సవరణలకు సిద్ధం!

25 Feb, 2015 03:18 IST|Sakshi

సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వం
 
న్యూఢిల్లీ: స్వపక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో భూసేకరణ బిల్లులో రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటూ పలు మార్పులకు అవకాశముందని ప్రభుత్వం సంకేతాలిచ్చింది. భూయజమానుల్లో 70% మంది ఆమోదంతో పాటు భూసేకరణలో సామాజిక ప్రభావ అంచనాను తప్పనిసరి చేయాలన్న రైతుల డిమాండ్‌పై ప్రభుత్వం మంగళవారం విసృ్తతంగా చర్చించింది. రైతుల ఆందోళనలకు సంబంధించిన అంశాలను బిల్లులో చేర్చే విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు మంత్రులు ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు.

‘ఈ బిల్లు విషయంలో వెనక్కుపోయే ప్రసక్తి లేదు కానీ రైతు ప్రయోజనాలకు సంబంధించిన సూచనలను స్వాగతిద్దాం’ అని బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ బిల్లు రైతులకు మేలు చేసేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన డిమాండ్లు, సలహాల ఆధారంగానే ఈ చట్టంలో సవరణలు పొందుపరిచామని మోదీ పార్టీ ఎంపీలతో అన్నారు. విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని ఆయన కోరారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను సవరించాల్సి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు, రైతు సంఘాల నాయకులతో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చలు కొనసాగిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు