విక్రమాదిత్య జాతిపరం

15 Jun, 2014 01:21 IST|Sakshi
విక్రమాదిత్య జాతిపరం

ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోడీ
 
ఐఎన్ ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక నుంచి: దేశంలో అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ నౌక నేవీలో చేరడాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ‘‘నేడు దేశానికి చాలా ముఖ్యమైన రోజు. భారత నౌకాదళ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను జాతికి అంకితం చేయడాన్ని నేను గర్వంగా భావిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. శనివారం గోవా తీరంలో ఉన్న ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకను మోడీ పరిశీలించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ సైనిక సంపత్తిని మోడీ పరిశీలించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తొలుత సీ కింగ్ చాపర్‌పై యుద్ధనౌక పైకి చేరుకున్న ప్రధాని.. నేవీ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. 44,500 టన్నుల ఈ భారీ యుద్ధనౌకను జాతికి అంకితం చేసిన అనంతరం కొద్ది గంటలపాటు నౌకపైనే కలియదిరిగారు. యుద్ధనౌక సామర్థ్యం, విశేషాలను తెలుసుకున్నారు. అనంతరం మిగ్-29 యుద్ధ విమానంలో కూర్చున్నారు. ఆ తర్వాత నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు.

రక్షణ పరికరాల తయారీలో ఎక్కువగా దిగుమతులపై ఆధారపడకుండా దేశం స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల కోసం ‘వార్ మెమోరియల్’ను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. రక్షణ సిబ్బందికి ‘ఒక ర్యాంకు.. ఒకే పెన్షన్’ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై వివిధ రకాల యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలను ప్రధాని మోడీ  తిలకించారు. కాగా, రక్తదానంలో యువత చురుగ్గా పాల్గొనాలని ప్రధాని  శనివారం రక్తదాన దినోత్సవం సందర్భంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు