ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

2 Sep, 2019 04:07 IST|Sakshi
కేరళ-ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్, మహారాష్ట్ర-భగత్‌ సింగ్‌ కోశ్యారీ, రాజస్తాన్‌ గవర్నర్‌-కల్‌రాజ్‌ మిశ్రా, హిమాచల్‌ప్రదేశ్‌- బండారు దత్తాత్రేయ

హిమాచల్‌ గవర్నర్‌గా దత్తాత్రేయ

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై

రాష్ట్రపతి కోవింద్‌ ఉత్తర్వులు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(58)ను కేంద్రం నియమించింది. ఆదివారం ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు వెలువరించారు. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ(72)ను హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించింది. మొత్తం ఐదు రాష్ట్రాలకు రాష్ట్రపతి కొత్త గవర్నర్లను నియమించారు.
తెలంగాణకు ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ స్థానంలో తమిళిసై సౌందరరాజన్, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రస్తుత గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా(78)ను రాజస్తాన్‌ గవర్నర్‌గా, హిమాచల్‌ ప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ, కేరళ గవర్నర్‌గా ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్, మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు స్థానంలో భగత్‌ సింగ్‌ కోశ్యారీ(77)ని నియమించింది. కొత్త గవర్నర్ల నియామకాలు వారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవనం తెలిపింది. రాజస్తాన్‌ గవర్నర్‌గా ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేస్తున్న యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ స్థానంలో మిశ్రా బాధ్యతలు స్వీకరించనున్నారు.

రాజీవ్‌ కేబినెట్‌లో మంత్రికి గవర్నర్‌ గిరీ
కేరళ గవర్నర్‌గా నియమితులైన ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌(68) సొంతరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. ఆయన గతంలో కేంద్రంలో రాజీవ్‌ గాంధీ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబానో కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా 1985లో అప్పటి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటాన్ని మంత్రిగా ఉన్న ఆరిఫ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ముస్లిం పర్సనల్‌ లా సంస్కరణలు చేపట్టాలని, ట్రిపుల్‌ తలాక్‌ను శిక్షార్హం చేయాలని ఆరిఫ్‌ గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆయన..2007 వరకు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ట్రిపుల్‌ తలాక్‌ను శిక్షార్హం చేస్తూ చట్టం చేసిన మోదీ ప్రభుత్వానికి ఆయన మద్దతు తెలిపారు. ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పళనిస్వామి సదాశివం స్థానంలో ఆరిఫ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. 

దక్షిణాదిలో బలపడేందుకేనా?
న్యూఢిల్లీ: తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారిని గవర్నర్లుగా నియమించడం దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో భాగమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతల్ని మచ్చిక చేసుకునేందుకు, కొత్త నాయకత్వంతో సంస్థాగతంగా బలం కూడదీసుకునేందుకు ఇటీవలి కాలంలో బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ద్రవిడ రాష్ట్రంలో కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి మార్గం సుగమమయ్యేలా తమిళనాడు బీజేపీ చీఫ్‌ తమిళిసై సౌందరరాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమించిందని పరిశీలకులు భావిస్తున్నారు.

అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో  టీడీపీ శ్రేణులను చేర్చుకోవడం ద్వారా బీజేపీని విస్తరించుకోవాలనే యోచనలో ఉందని అంటున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతటా బీజేపీ సత్తా చాటినప్పటికీ, ఇప్పటికే బలంగా ఉన్న కర్ణాటక మినహా  ప్రభావం చూపలేకపోయింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది.  అయితే, 2014 ఎన్నికల్లో ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించిన బీజేపీ ఈసారి నాలుగు సీట్లు గెలుచుకుంది. అధికార టీఆర్‌ఎస్‌కు దీటుగా ఎదిగేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలను చేర్చుకోవడం వంటి చర్యలను వేగవంతం చేసింది.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రాభవం తగ్గడంతో కేరళ వంటి రాష్ట్రాల్లో బలం పుంజుకునేందుకు తమ పార్టీకి మంచి అవకాశాలున్నాయని  సీనియర్‌ నేత ఒకరు అన్నారు. అదేవిధంగా, తమిళనాడులో దిగ్గజ నేతలు జయలలిత, కరుణానిధిల మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. కర్ణాటకకు చెందిన బీఎల్‌ సంతోష్‌ను జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)గా నియమించడం కూడా  దక్షిణాదిన బలపడేందుకు దోహదం చేస్తుందని పార్టీ నేతలు అంటున్నారు.

మరిన్ని వార్తలు