'మమ్మల్ని భయపెట్టలేరు'

26 Jan, 2016 19:21 IST|Sakshi
'మమ్మల్ని భయపెట్టలేరు'

న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండే మంగళవారం వేడుకల అనంతరం ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరివెళ్లారు. విమానాశ్రయంలో భారత్ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. విమానం ఎక్కేముందు విలేకరులతో మాట్లాడిన హోలాండే.. ఫ్రాన్స్, భారత్ లు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు నిర్వచనాలుగా నిలుస్తాయని, అందుకే ఈ రెండు దేశాలపై ఉగ్రదాడులు జరుగుతున్నాయన్నారు. ఉగ్రవాదంపై పోరులో వెనకడుగువేయబోమని తేల్చిచెప్పారు.'మేం దేనికీ భయపడం, మమ్మల్నెవ్వరూ భయపెట్టలేరు. ఉగ్రవాదుల పీచమణిచే విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు' అని హోలాండే ఉద్ఘాటించారు.

ఉదయం రాజ్ పథ్ లో జరిగిన గణతంత్రవేడుకల్లో విశిష్టఅతిథిగా పాల్గొన్న హోలాండే.. మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన తేనీటి విందును స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. పలువురితో కరచాలనం చేస్తూ హుషారుగా గడిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పలువురు కేంద్రమంత్రులు కూడా ఈ ఎట్ హోమ్ కు హాజరయ్యారు.

తన మూడు రోజుల భారత పర్యటనలో హోలాండే.. చండీగఢ్‌ లో నిర్వహించిన వాణిజ్య సదస్సు భారత ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఉభయదేశాలకు చెందిన కార్పొరేట్ సంస్థల అధిపతులు హాజరయ్యారు. చండీగఢ్‌లోని రాక్‌గార్డెన్, క్యాపిటల్ కాంప్లెక్స్ ప్రభుత్వ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీలను కూడా హోలాండే సందర్శించారు. రెండో రోజు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్, పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు