పాత నోట్లు : జరిమానాకు రాష్ట్రపతి ఓకే

31 Dec, 2016 08:28 IST|Sakshi
పాత నోట్లు : జరిమానాకు రాష్ట్రపతి ఓకే

న్యూఢిల్లీ: మార్చి 31 తర్వాత రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు భారీ ఎత్తున కలిగి ఉన్నవారిపై జరిమానా విధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి డిసెంబర్ 30 శుక్రవారం నాటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశం ఈ ఆర్డినెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి గడువు ముగియడం, శీతాకాల విడిది కోసం గత పది రోజులుగా హైదరాబాద్ లో విడిది చేసిన రాష్ట్రపతి శుక్రవారం సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకోవడం, ఆ వెంటనే కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు ఆయన ఆమోదం తెలపడం వెనువెంటనే జరిగిపోయాయి. తాజా ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా జరిమానా విధించనున్నారు. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారు.

(చదవండి : పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే!)

గత నవంబర్ 8 నుంచి పెద్ద నోట్లను రద్దు చేయగా, అప్పటి నుంచి వాటిని డిపాజిట్ చేసే గడువు పూర్తయ్యే వరకు విదేశాల్లో ఉండిపోయిన వారికి మాత్రం మరో అవకాశం కల్పించారు. అలాంటి వాళ్లు వచ్చే మార్చి 31 వరకు తమ పాత నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే విదేశాల్లో ఉన్న భారతీయ కరెన్సీ తెచ్చుకోవాలంటే అందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను కూడా విధించింది. ఒక్కో వ్యక్తి 25 వేల రూపాయలకు మించి తెచ్చుకోవడానికి వీలులేదు. పైగా ఎయిర్ పోర్టుల్లో వాటిని విధిగా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరైనా తప్పుగా నమోదు చేస్తే మాత్రం 50 వేల రూపాయల జరిమానా లేదా దానికి అయిదింతల మేరకు జరిమానా ఉంటుంది. నేపాల్, భూటాన్ దేశాల నుంచి తీసుకురావాలనుకుంటే వారికి ఫెమా చట్టం పరిధికి లోబడి మాత్రమే అనుమతిస్తారు.

మరిన్ని వార్తలు