15 మందికి నారీ శక్తి పురస్కారాలు

9 Mar, 2020 04:28 IST|Sakshi
నారీశక్తి పురస్కార విజేతలతో ప్రధాని మోదీ గ్రూప్‌ ఫొటో

ప్రదానం చేసిన రాష్ట్రపతి కోవింద్‌

ఏపీకి చెందిన భూదేవికి కూడా..

సాక్షి, న్యూఢిల్లీ: పోడు వ్యవసాయంలోనూ, గ్రామీణ మహిళల వికాసంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పడాల భూదేవి, 93 ఏళ్ల వయసులో కెరీర్‌ ఆరంభించి చండీగఢ్‌ అద్భుతంగా పేరు సంపాదించి, ఎన్నో అవార్డులు రివార్డులు సాధించిన శతాధిక వృద్ధ అథ్లెట్, మష్రూమ్‌ మహిళ, జార్ఖండ్‌ లేడీ టార్జాన్‌ సహా 15 మంది 2019 సంవత్సరానికిగాను నారీ శక్తి పురస్కారాలను గెలుచుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఈ అవార్డులను వారికి ప్రదానం చేశారు.

మహిళా సాధికారత, సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సమాజంలో సానుకూల మార్పుల్ని తీసుకువచ్చే మహిళలకు ఏటా మహిళా శక్తి పురస్కారాలు అందజేస్తారు. బహుమతి గ్రహీతల్లో శ్రీకాకుళంకు చెందిన పడాల భూదేవితో పాటు వీణా దేవి (40–బీహార్‌), అరిఫా జాన్‌ (33–శ్రీనగర్, జమ్మూ కశ్మీర్‌), చారి ముర్ము (47–జార్ఖండ్‌), నిలజా వాంగ్మో (40–లేహ్‌), రష్మీ ఊర్థర్దేశ్‌ (60–పుణే, మహారాష్ట్ర), మాన్‌ కౌర్‌ (103–పాటియాలా, పంజాబ్‌), కళావతీ దేవీ (68–కాన్పూర్, ఉత్తరప్రదేశ్‌), తాషి, నుంగ్షీ (కవలలు) (28– డెహ్రాడూన్‌ – ఉత్తరాఖండ్‌), కౌషికి చక్రవర్తి (38–కోల్‌కతా, పశ్చిమబెంగాల్‌), అవని చతుర్వేది, భావనాకాంత్, మోహనాసింగ్‌ (వాయుసేన మొదటి మహిళా పైలెట్లు), భగీరథి అమ్మా (105)– కాత్యాయని(98) (అలప్పుజ–కేరళ)లు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు.  

పౌష్టికాహార లోపాల్ని నివారించండి: ప్రధాని
నారీశక్తి అవార్డు పొందిన 15 మందిలో 14 మందితో ప్రధాని మోదీ తన నివాసంలో ముచ్చటించారు. పిల్లల్లో, మహిళల్లో ఉన్న పౌష్టికాహార లోపాల్ని నివారించడం, నీటిని బొట్టు బొట్టు సంరక్షించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నారీ మణులు సాధించిన లక్ష్యాలు కేసు స్టడీలుగా యూనివర్సిటీలకు ఉపయోగపడతాయని కొనియాడారు. అవార్డు గ్రహీతల్లో కశ్మీర్‌కు చెందిన ఆరిఫా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటర్నెట్‌పై నిషేధం తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తోందని ప్రధాని దృష్టికి తెచ్చారు.

భూదేవి విజయగాథ
ముగ్గురు ఆడపిల్లల తల్లినని తాను ఏనాడూ చింతించ లేదని భర్త వదలి వేస్తే కన్న వారింటిలో ఉండి గ్రామీణ, గిరిజన మహిళల వికాసానికి నడుం కట్టానని నారీశక్తి అవార్డు గ్రహీత పడాల భూదేవి అన్నారు. ఆమె అవార్డు అందుకున్న అనంతరం ప్రధాని మోదీ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో తన అనుభవాలను వివరించారు. గిరిజనుల్లో సవర తెగకు చెందిన తనకు చిరుప్రాయంలోనే వివాహమైతే ముగ్గురూ ఆడపిల్లలనే కన్నానని మెట్టినింటి వారు బయటకు పంపేశారన్నారు. తండ్రి చాటు బిడ్డగా పొలం పనిని నేర్చుకున్నానని, తనలాంటి వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నానన్నారు.

1–70 గిరిజన చట్టంలోని హక్కులు, మహిళా హక్కులను గురించి సభల్లో తెలుసుకున్నానని ఆ చట్టం కింద మహిళలను పెద్ద సంఖ్యలో సమీకరించి కొన్ని వేల ఎకరాల పోడు భూమిని సేకరించి చిరుధాన్యాల సాగుకు పూనుకున్నామన్నారు.  పంటను మార్కెట్‌కు పంపితే డబ్బులు వస్తాయి కానీ పౌష్టికాహారం అందదు, అందుకే వాల్యూ అడిషన్‌ను చేకూర్చాలని నిర్ణయించాము. కంపెనీలను ఏర్పాటు చేసి చిరుధాన్యాలను పొడిగా మార్చి మార్కెటింగ్‌ చేయడం, బిస్కెట్లుగా తయారు చేయడం వంటివి మొదలు పెట్టాము.

ఈరోజు తాము 15,000 మంది ఐసీడీఎస్‌ పథకం కింద ఉన్న బాలబాలికలకు (3–4 ఏళ్లలోపు) బిస్కెట్లు సరఫరా చేసి పౌష్టికాహారం అందజేయగలుగుతున్నాము.  కలెక్టర్‌ సహకారంతో  పంటలను మార్కెటింగ్‌ చేసుకోగలుగుతున్నాము. రైతుల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఆమె వివరిస్తుండగా ప్రధాని  అభినందించారు. భూదేవి తాను ప్రసంగించేటపుడు తనకు హిందీ రాదని అయినా హిందీలోనే చెప్పడానికి ప్రయత్నిస్తాననన్నారు. ఆమె చక్కగా హిందీ , కొన్ని ఇంగ్లీషు పదాలతో కలగలిపి చేసిన ప్రసంగం ప్రధానిని హత్తుకుంది. మీరు హిందీ చాలా బాగా మాట్లాడారు. మాట్లాడలేననే చింత వద్దు అని అన్నారు.
 

మరిన్ని వార్తలు