ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మీడియాదే

23 Feb, 2020 03:41 IST|Sakshi
రాష్ట్రపతికి జ్ఞాపికను అందజేస్తున్న ఎన్‌.రామ్‌

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

సాక్షి, బెంగళూరు: ‘కొత్తగా వస్తున్న మాధ్యమాలు అనతికాలంలోనే ప్రజలకు చేరువ అవుతున్నాయి. ఈ క్రమంలో నిజాలను జనాలను తెలియజేయాల్సిన బాధ్యత మాధ్యమాలదే. కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయ మాధ్యమాలు వాస్తవాలను వెలుగులోకి తేవడంతో విజయవంతం అయ్యాయి’అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. శనివారం బెంగళూరులోని హిందూ గ్రూప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ది హడిల్‌’ నాలుగవ ఎడిషన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

రాష్ట్రపతి మాట్లాడుతూ మాధ్యమ రంగంలో వాస్తవాలు తెలియజేయడం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, న్యాయం, మానవీయత అనే ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇటీవల కాలంలో కొత్తగా ఎన్ని పత్రికలు వచ్చినా.. ఎప్పటి నుంచో ఉన్న వార్తా సంస్థలకు ప్రాధాన్యం తగ్గలేదన్నారు. క్రీడలు, వ్యాపారం, రాజకీయం, సామాజిక రంగాల వార్తలకు ప్రముఖ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోందన్నారు. సోషల్‌ మీడియా పెరిగిపోతున్నా, పత్రికలకు ప్రాధాన్యం తగ్గలేదన్నారు.

జాతిపిత కూడా విలేకరే...
జాతిపిత మహాత్మాగాంధీ కూడా పత్రికా విలేకరిగా పని చేశారని రాష్ట్రపతి గుర్తు చేశారు. సత్యం, ప్రామాణికమే మాధ్యమాల ప్రధాన ఆయుధం అన్నారు. మాధ్యమాల్లో నిజాయితీ, పాలనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం యడియూరప్ప అన్నారు. పాలనలోని పారదర్శకతను గుర్తించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియా రంగంపై ఉందని చెప్పారు. మంచి పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు