అవినీతి రహిత పాలనకే ప్రాధాన్యం : రాష్ట్రపతి

31 Jan, 2019 11:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి రహిత పాలనకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. నిరుపేదలకు సైతం వంటగ్యాస్‌, విద్యుత్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. నవభారత నిర్మాణానికి ప్రభుత్వం కృషిసాగిస్తుందన్నారు.  పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడంతో గురువారం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

కోవింద్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆయుష్మాన్‌ భారత్‌ సహా పలు ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు. మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. హృద్రోగులకు ఉపయోగించే స్టెంట్‌ల ధరను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. 50 కోట్ల మందికి ప్రభుత్వం ఆరోగ్య బీమాను అమలుచేస్తోందన్నారు.

ప్రతి ఇంటికీ విద్యుత్‌ కనెక్షన్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు. కాగా, అంతకుముందు పార్లమెంట్‌ సమావేశాలకు విపక్షాలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌ సమావేశాల్లో సభ్యులు అర్ధవంతమైన చర్చల్లో భాగస్వాములు కావాలని కోరారు. కీలక అంశాలన్నింటిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు ఏప్రిల్‌-మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో 16వ లోక్‌సభ చిట్టచివరి సమావేశం గురువారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 13 వరకూ జరిగే ఈ సమావేశాల్లో ఫిబ్రవరి 1న ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సభ సజావుగా సాగేందుకు సభ్యలు సహకరించాలని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ కోరారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తాలని సభ్యులకు ఆమె సూచించారు.

మరిన్ని వార్తలు