రాజ్యసభకు నలుగురిని నామినేట్‌ చేసిన రాష్ట్రపతి

14 Jul, 2018 13:45 IST|Sakshi
రామ్‌నాథ్‌ కోవింద్‌(పాత చిత్రం)

న్యూఢిల్లీ : వివిధ రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం రాజ్యసభకు నామినేట్‌ చేశారు. రాజ్యసభకు నామినేట్‌ అయిన వారిలో దళిత నాయకుడు రామ్‌ శకల్‌,  ప్రముఖ కాలమిస్ట్‌ రాకేశ్‌ సిన్హా, శిల్పకారుడు రఘనాథ్‌ మహాపాత్ర, క్లాసికల్‌ డ్యాన్సర్‌ సోనాల్‌ మన్‌సింగ్‌ ఉన్నారు.  ప్రధానమంత్రి సూచన మేరకు సాహిత్యం, కళ, సైన్స్‌, సామాజిక సేవా రంగాలకు చెందిన 12 మందిని రాజ్యసభకు నామినేట్‌ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో వారి స్థానంలో కొత్తగా నలుగురు సభ్యులను కోవింద్‌ నామినేట్‌ చేశారు.

1. రామ్‌ శకల్‌ : రామ్‌ శకల్‌ ఉత్తరప్రదేశ్‌లోని రాబర్ట్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు పార్లమెంట్‌ సభ్యునిగా పనిచేశారు. రైతు నాయకుడిగా ఉన్న శకల్‌ రైతుల, కూలీల, వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్నారు.

2. రాకేశ్‌ సిన్హా : ఆరెస్సెస్‌ భావజాలం కలిగిన సిన్హా ఇండియన్‌ పాలసీ పౌండేషన్‌ను స్థాపించారు. కాలమిస్ట్‌గా సిన్హా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని మోతీలాల్‌ నెహ్రూ కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రచయితగా కూడా పలు పుస్తకాలు రచించారు.
 
3. రఘునాథ్‌ మహాపాత్ర : రఘునాథ్‌ తన శిల్పకళతో ప్రపంచవ్యాప్త గుర్తింపుపొందారు. 1959 నుంచి ఆయన శిల్పిగా కొనసాగుతున్నారు. ఆయనకు రెండు వేల మందిపైగా శిష్యులున్నారు. శ్రీ జగన్నాథ ఆలయం సుందరీకరణ కోసం ఆయన పనిచేశారు. భారత ప్రభుత్వం రఘునాథ్‌ను 2001లో పద్మభూషణ్‌తో, 2013 పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఆయన ప్రస్తుతం ఒడిశా లలితకళ అకాడమీకి  చైర్మన్‌గా ఉన్నారు.

4. సోనాల్‌ మన్‌సింగ్‌ :  మన్‌సింగ్‌ ఆరు దశాబ్దలకు పైగా శాస్త్రీయ నృత్యంలో కొనసాగుతున్నారు. ఆమె కొరియోగ్రాఫర్‌గా, టీచర్‌గా, సంఘ సేవకురాలుగా సేవలు అందించారు. 1977లో ఢిల్లీలో సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ క్లాసికల్‌ డ్యాన్సెస్‌ నెలకొల్పారు. శాస్త్రీయ నృత్యంలో ఆమె సేవలకు గాను భారత ప్రభుత్వం 1992లో పద్మభూషణ్‌, 2003లో పద్మవిభూషణ్‌తో గౌరవించింది. మన్‌సింగ్‌ 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు