మహిళా పోలీసు పట్ల రాష్ట్రపతి ఔదార్యం

29 Oct, 2019 17:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు చాలా హుందాగా, గంభీరంగా వ్యవహరిస్తారు. ప్రోటోకాల్‌ను పాటిస్తూ తమ విధులను నిర్వర్తిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో అవేవి పట్టించుకోకుండా మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారు. ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. మంగళవారం కూడా అటువంటి సన్నివేశం ఒకటి రాష్ట్రపతి సమావేశంలో జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మంగళవారం మొదటి జాతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యత పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, సహాయ ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

వారంతా వేదికపై నిలబడి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. అదే సమయంలో వేదిక ముందు మొదటి వరుసలో నిల్చున్న ఓ మహిళా పోలీసు అధికారి కాలి మడమ మెలికపడి కుప్పకూలి పడిపోయారు. జాతీయ గీతాలాపన పూర్తి కాగానే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్కడే ఉన్న మంత్రి సీతారామన్‌, అనురాగ్ ఠాకూర్‌తో మాట్లాడి, వేదిక నుంచి దిగి, కుప్పకూలిన మహిళా పోలీసు అధికారి వద్దకు వెళ్ళి, పరామర్శించారు. ఆమె ప్రమాదమేమి లేదని నిర్థారించుకున్న తర్వాత వారంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రోటోకాల్‌ని పక్కకు పెట్టి ఓ పోలీసు అధికారిని పరామార్శించిన రాష్ట్రపతిని అందరూ ప్రశంసిస్తున్నారు. 

మరిన్ని వార్తలు