ఆరుగురు రాష్ట్రపతులు ఇక్కడి విద్యార్థులే

6 May, 2018 02:06 IST|Sakshi
స్నాతకోత్సవంలో మాట్లాడుతున్న కోవింద్‌

మద్రాస్‌ వర్సిటీపై కోవింద్‌ ప్రశంస

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆరుగురు రాష్ట్రపతులను అందించిన ఘనత మద్రాసు యూనివర్సిటీకే సొంతమని రాష్ట్రపతి కోవింద్‌ అన్నారు.  మద్రాసు వర్సిటీ 160వ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించగా రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థుల్లో మూడింట ఒకవంతు అమ్మాయిలుండటంపై కోవింద్‌ మాట్లాడుతూ ఒక అమ్మాయిని చదివిస్తే రెండు కుటుంబాలను చదివించినట్లేనన్నారు. ‘ మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, ఆర్‌ వెంకట్రామన్, కేఆర్‌ నారాయణన్, అబ్దుల్‌ కలాం.. వీరంతా ఇక్కడ చదువుకున్న వారే.

తొలి గవర్నర్‌ జనరల్‌ సీ రాజగోపాలాచారి ఈ వర్సిటీ విద్యార్థే. నోబెల్‌ బహుమతులు అందుకున్న సీవీ రామన్, సుబ్రమణియన్‌ చంద్రశేఖర్‌లు సైతం ఇక్కడే చదువుకున్నారు. ఈ వర్సిటీలో విద్యనభ్యసించిన సుబ్బారావు, పతంజలి శాస్త్రిలు ప్రధాన న్యాయమూర్తులుగా ఎదిగారు. ప్రపంచ చెస్‌ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్, సరోజినీనాయుడు, సీ సుబ్రమణియన్‌లు కూడా వర్సిటీకి పేరు తెచ్చినవారే. ఇంతటి పేరు ప్రఖ్యాతులు, ఘనత వహించిన విశ్వవిద్యాలయమిది’ అని కోవింద్‌ అన్నారు. స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్‌ పురోహిత్‌ పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు