హేయమైన ఘటనల మధ్య హక్కులెలా !

11 Dec, 2019 01:23 IST|Sakshi

మానవ హక్కులపై అందరిలో ఆత్మశోధన అవసరం

దార్శనికుల స్వప్నాలను సాకారం చేద్దామని పిలుపు

మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగం

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మహిళలపై పెరిగిపోతున్న నేర ఘటనలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సమానహక్కులు అన్న సార్వత్రిక లక్ష్యం సఫలతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మానవ హక్కుల దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడారు.

ఐక్యరాజ్యసమితి 1948లో యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (యూడీహెచ్‌ఆర్‌)ను ఆమోదించగా.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్‌ 10వ తేదీని మానవ హక్కుల దినంగా పాటిస్తున్నారు.యూడీహెచ్‌ఆర్‌ రూపకల్పనలో భారత్‌కు చెందిన సంఘసంస్కర్త, విద్యావేత్త హన్సా జీవ్‌రాజ్‌మెహతా కీలకపాత్ర పోషించారని, ఆ ప్రకటనలోని ఆర్టికల్‌ 1 ముసాయిదాలో ‘ఆల్‌ మెన్‌ ఆర్‌ బోర్న్‌ ఫ్రీ అండ్‌ ఈక్వల్‌’ అన్న వాక్యాన్ని హన్సా ‘ఆల్‌ హ్యూమన్స్‌...’గా మార్చడానికి కృషి చేసి విజయం సాధించారని రాష్ట్రపతి గుర్తు చేశారు.

అయితే స్త్రీ, పురుష సమానత్వం, మానవ హక్కుల విషయంలో హన్సా లాంటి దార్శనికుల స్వప్నాలను సాకారం చేసేందుకు చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని రాష్ట్రపతి అన్నారు. సమాన హక్కులు, గౌరవమన్న విషయాల్లో మనల్ని మనం ప్రశ్నించుకోవడం ద్వారా ఈ దిశగా తొలి అడుగు వేయాలని సూచించారు. 

జాతిపిత చెప్పిందీ అదే..
దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస సంఘటనలు మనల్ని పునరాలోచనలో పడేస్తున్నాయని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని, ఇది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రపంచమంతా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆత్మశోధన చేసుకోవాలి’అని ఆయన అన్నారు. దీంతోపాటు యూడీహెచ్‌ఆర్‌ను సమీక్షించి మానవ హక్కులను పునః నిర్వచించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

పిల్లలు, వెట్టిచాకిరీలో మగ్గుతున్న వారు, స్వల్ప నేరాలకు గాను దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న వారిపట్ల సానుభూతి చూపాల్సిన అవసరముందని, వీరి హక్కుల విషయంలో మరింతగా ఆలోచన చేయాల్సి ఉందని వివరించారు. మానవ హక్కుల విషయంలో ఆత్మశోధన ఎంత అవసరమో, సమాజం, తన హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడమూ అంతే అవసరమని రాష్ట్రపతి తెలిపారు.

జాతిపిత మహాత్మాగాంధీ సైతం మానవ హక్కులు, పౌర విధులు ఒకే నాణేనికి రెండు పార్శా్వల వంటివని చెప్పారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్తు, భారత్‌లో ఐక్యరాజ్య సమితి రెసిడెంట్‌ కో ఆర్డినేటర్‌ రెనెటా లోక్‌ డెస్సాలియన్‌ తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు