ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి ఆమోదం

23 Apr, 2018 04:16 IST|Sakshi

న్యూఢిల్లీ: అత్యాచార దోషులకు కఠిన శిక్షలతోపాటు, రుణ ఎగవేత దారుల ఆస్తుల జప్తు, శిక్షల విధింపునకు సంబంధించి కేంద్రం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు జరగడం లేనందున, ఈ ఆర్డినెన్స్‌లను అత్యవసరమైనవిగా భావించి.. రాజ్యాంగంలోని 123 ఆర్టికల్‌ ప్రకారం వీటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని గెజిట్‌ నోటిఫికేషన్‌ తెలిపింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్‌లను కేంద్ర కేబినెట్‌ శనివారం ఆమోదించిన రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్‌ ప్రకారం.. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే రేపిస్టులకు గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు.   అలాగే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల జప్తునకు మరో ఆర్డినెన్స్‌ వీలు కల్పిస్తుంది.

మరిన్ని వార్తలు