నితీశ్‌కు..బీజేపీకి ఏంటి?

21 Jun, 2017 18:56 IST|Sakshi
ఎన్డీయే గూటికి నితీశ్‌?

బీహార్‌లో రాజకీయం మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తిరిగి ఎన్డీయే గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనపడుతోంది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ప్రకటించడం ద్వారా ఈ దిశగా నితీశ్‌ విస్పష్టమైన సంకేతాలు ఇచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు.

ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం భాగస్వామి, మహా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) వైఖరికి భిన్నంగా... నితీశ్‌ పార్టీ జేడీయూ ఎన్డీయే అభ్యర్థికి జై కొట్టింది. లాలూ– నితీశ్‌లకు మధ్య ఇప్పటికే ఉన్న విబేధాలకు ఇది ఆజ్యం పోస్తుందని, సంకీర్ణం బీటలు వారి కొత్త పొత్తులు పొడుస్తాయని నిపుణుల అంచనా.

నిజానికి గతంలో నితీశ్‌ పార్టీ జేడీయూ, బీజేపీలు ఏకంగా 17 ఏళ్లు కలిసే ఉన్నాయి. అయితే 2013లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక... నితీశ్‌ ఎన్డీయేనుంచి బయటికి వచ్చారు. 2015లో కాంగ్రెస్‌ పార్టీ చొరవతో ఆర్జేడీ, జేడీయూ, హస్తం పార్టీ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. బీహార్‌లో అధికారం తమదేనని నమ్మకంతో ఉన్న మోదీ, అమిత్‌షాలకు ఈ కొత్త కూటమి షాకిచ్చింది. 243 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 178 గెలిచి అధికారంలోకి వచ్చింది.

దూరం తగ్గుతోందిలా...
బీజేపీ– జేడీయూ గతకొంతకాలంగా దగ్గరవుతున్నాయి. నితీశ్‌ కొన్నిసార్లు మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటం, ప్రధాని మోదీ కూడా నితీశ్‌ను పొగడడం చూసి... ఏదో కొత్త బంధం బలపడుతోందనే ఊహాగానాలు వచ్చాయి.
2016 సెప్టెంబరులో భారత్‌ ఎల్‌వోసీని దాటి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో జరిపిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ను విపక్షాలు ప్రశ్నించాయి. గొప్పలు చెప్పుకోవద్దు... ఆధారాలు చూపండని కూడా కొన్ని పార్టీలడిగాయి. నితీశ్‌ మాత్రం కేంద్రం చర్యలను బాహటంగా సమర్థించారు.
పెద్దనోట్ల రద్దుపై విపక్షాలన్నీ విరుచుకుపడ్డా... నితీశ్‌ ప్రధాని నిర్ణయాన్ని సమర్థించారు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టే ఏ చర్యనైనా సమర్థించాలనే విధాన నిర్ణయంలో భాగంగానే నోట్లరద్దును స్వాగతించినట్లు చెప్పారు.
గురు గోవింద్‌ సింగ్‌ 350 జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాది జనవరిలో పాట్నాలో నిర్వహించిన ప్రకాశ్‌ పర్వ్‌ ఉత్సవాలకు మోదీ హాజరయ్యారు. మధ్యనిషేధాన్ని తెచ్చినందుకు నితీశ్‌ను మోదీ పొగడగా... డీమానిటైజేషన్‌ సాహసోపేత చర్యని మోదీపై నితీశ్‌ ప్రశంసలు కురిపించారు.
జనవరి 15న దహి చురాను పురస్కరించుకొని జేడీయూ ఇచ్చిన విందుకు అనూహ్యంగా బీజేపీ నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. బీజేపీ సీనియర్‌ నేతలు చాలామంది నితీశ్‌ అధికారిక నివాసంలో ఇచ్చిన విందుకు హాజరయ్యారు.
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చినెలల్లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీకి జేడీయూ దూరంగా ఉంది. నితీశ్‌కు  బీసీ నేతగా పేరుంది. జేడీయూ పోటీచేస్తే బీజేపీ ఆశలు పెట్టుకున్న ఎంబీసీ ఓటు బ్యాంకును దెబ్బకొట్టవచ్చని లాలూ తదితరులు వాదించారు. నితీశ్‌ పట్టించుకోలేదు. లాలూ వెళ్లి సమాజ్‌వాది తరఫున ప్రచారం చేశారు. కానీ నితీశ్‌ యూపీ ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. బీజేపీకి సాయపడేందుకే నితీశ్‌ ఇలా చేశారని ఆర్జేడీ ఆరోపించింది కూడా.
యూపీలో బీజేపీ భారీ విజయం నేపథ్యంలో... ఎన్డీయేలో నితీశ్‌ చేరికకు తెరవెనుక మంతనాలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి.
బీహార్‌ బీజేపీ నేతలు లాలూ కుటుంబ సభ్యులపై అక్రమాస్తుల ఆరోపణలు చేయడం... వెనువెంటనే సీబీఐ రంగంలోకి దిగడం, కేసులు, బినామీ ఆస్తుల జప్తు జరిగిపోయాయి. కొన్నాళ్లుగా లాలూ కుటుంబం కేసులు, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఈ కేసుల వ్యవహారంలో లాలూకు మద్దతుగా నితీశ్‌ ఏనాడూ ఒక్కముక్క కూడా మాట్లాడలేదు.
తాజాగా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ప్రకటించారు. బీజేపీ పొడగిట్టని సంకీర్ణ భాగస్వామి ఆర్జేడీ ఎలా స్పందిస్తుంది... తెగదెంపుల దాకా వ్యవహారం వెళుతుందా? చూడాలి.

బలముంది...
ఆర్జేడీ, కాంగ్రెస్‌లను వదులుకొని నితీశ్‌ ఎన్డీయే పంచన చేరితే బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగినంత బలం ఉంటుంది. బీజేపీ మద్దతుతో మేజిక్‌ ఫిగర్‌ (243 అసెంబ్లీ స్థానాల్లో సాధారణ మెజారిటీ... అంటే 122 సీట్లు)ను అందుకోగలరు. జేడీయూకు 71 సీట్లుండగా, బీజేపీకి 53 సీట్లున్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ పార్టీ లోక్‌ జనశక్తికి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. అంటే వీరి బలం 126 అవుతుంది. ఎల్‌జేపీ కాకుండా నలుగురు స్వతంత్రులు, చిన్నాచితక పార్టీలకు ఆరుగురు సభ్యులున్నారు. ఈ పది మందిని ఆకర్షించేందుకు ఆస్కారముంటుంది. సాధారణ మెజారిటీకి 122 సీట్లుంటే చాలు.

పార్టీ  అసెంబ్లీ స్థానాలు
ఆర్జేడీ 80
జేడీయూ 71
కాంగ్రెస్‌ 27
బీజేపీ 53
ఇతరులు 12
మొత్తం   243

నితీశ్‌కు ఏంటి?
మహాకూటమిలో 80 స్థానాలతో ఆర్జేడీయే అతిపెద్ద పార్టీగా ఉంది. అయితే ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందానికి కట్టుబడి లాలూ... నితీశ్‌కు సీఎం పదవి చేపట్టేందుకు అంగీకరించారు. పైగా ఎన్నికల్లో పోటీచేయకుండా లాలూపై ఆరేళ్ల నిషేధం ఉంది. పెద్దపార్టీ కాబట్టి తమ మాట చెల్లుబాటు కావాలనే పంతం లాలూలో ఉంది. ఫలితంగా ఆయన నుంచి, ఆర్జేడీ నుంచి నితీశ్‌ నిత్యం ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు. వారి కోరికలు తీర్చుతూ పాలన చేయడం ఆయనకు ఇబ్బందిగా మారింది. బీజేపీ పంచన చేరితే ఇలాంటి ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది.


లాలూ కుటుంబం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. మరోవైపు నితీశ్‌కు క్లీన్‌ ఇమేజ్‌ ఉంది. ఇంకా ఆర్జేడీతో అంటకాగితే తన ప్రతిష్టకు మచ్చ రావొచ్చు. కాబట్టి తెగదెంపులే బెటర్‌ అనుకోవచ్చు.
బిహార్‌ అభివృద్ధికి కేంద్రంతో సఖ్యతగా ఉండటమే మంచిది. యూపీలో బీజేపీ ఘన విజయం తర్వాత మోదీకి గట్టి ప్రత్యామ్నాయం కనుచూపు మేరల్లో కనపడని పరిస్థితి. అలాంటపుడు ఎన్డీయేకు దూరంగా ఉండటంలో అర్థం ఉండదు.

బీజేపీకి ఏంటి?
బీజేపికి ప్రత్యామ్నాయంగా 2019 కల్లా విపక్షాలను కలిపి మహాకూటమిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. దీని అవసరాన్ని చెప్పిందే నితీశ్‌. అలాంటి నితీశ్‌ను తమవైపు తిప్పుకుంటే మహాకూటమి ప్రయత్నాలకు ఆదిలోనే గండికొట్టినట్లవుతుంది.
రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీయేకు 48.64 శాతం బలముంది. వైఎస్సార్‌సీపీ (1.53 ఓట్ల శాతం), టీఆర్‌ఎస్‌ (1.99), అన్నాడీఎంకే (5.36), బీజేడీ (2.98) ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. దీనికి తాజాగా జేడీయూ (1.89) కూడా తోడైతే కోవింద్‌కు మద్దతుగా 62.39 శాతం ఓట్లున్నట్లు లెక్క. విపక్షాలు మొక్కుబడి పోటీపెట్టడమే తప్పితే... ఫలితం సుస్పష్టం.
రాజ్యసభలో ఎన్డీయే బలపడుతుంది. ప్రస్తుతం ఎన్డీయేకు 74 మంది ఎంపీలున్నారు. వీరికి జేడీయూ పది మంది ఎంపీలు తోడైతే పెద్దలసభలో బీజేపీకి కొంత ఊరట.
నితీశ్‌తో తెగదెంపులు చేసుకున్నాక 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ ఘోరంగా దెబ్బతింది. 53 స్థానాలతో సరిపెట్టుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే... నితీశ్‌ కలుపుకుపోవడం బీజేపీకి అవసరం.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు