కేంద్రానికి ఎదురుదెబ్బ.. రాష్ట్రపతి పాలన రద్దు

21 Apr, 2016 15:40 IST|Sakshi
కేంద్రానికి ఎదురుదెబ్బ.. రాష్ట్రపతి పాలన రద్దు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం విధించిన రాష్ట్రపతి పాలనను ఉత్తరాఖండ్ హైకోర్టు రద్దు చేసింది. 356 అధికరణంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఈ నిర్ణయం విరుద్ధమని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగి తేలాయి. కేంద్ర ప్రభుత్వం తమకు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశాయి. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం అని ఉద్ఘాటించాయి. కాగా, 29న హరీశ్ రావత్ బల పరీక్షను ఎదుర్కోనున్నారు.

హైకోర్టు ఏం వ్యాఖ్యానించిందంటే..
'ఉత్తరాఖండ్ లో తప్పుడు విధంగా రాష్ట్రపతి పరిపాలన విధించారు. ఈ రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతి పరిపాలన అనేది అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరి ప్రయత్నంగా మాత్రమే విధించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనా ప్రజాప్రతినిధులను ఇలా అనూహ్యంగా తొలగించడమనేది పౌరుల హృదయాలపై మూర్ఖంగా దెబ్బకొట్టడమే. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ఎంతో తొందరపడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మెజారిటీ నిరూపించుకునేందుకు మరో రోజు ఉండగానే ఇలా త్వరత్వరగా రాష్ట్రపతి పాలన విధించడం అనేది కేంద్రం చేసిన అనాధికార కార్యక్రమంలాగా కనిపిస్తోంది' అని కోర్టు వ్యాఖ్యానించింది.

కాంగ్రెస్లో సంబరాల కోలాహలం
ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీలో సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సీఎం హరీశ్ రావత్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున సంబరాలు ప్రారంభమయ్యాయి. భారీ సంఖ్యలో మద్దతుదారులు ఆయన నివాసం వద్దకు చేరుకొని టపాకాయలు కాల్చారు. పలువురు పత్రికా ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత హృదయేష్ స్పందిస్తూ మరోసారి సత్యాన్ని, ధర్మాన్ని కాపాడిన మన న్యాయ వ్యవస్థకు నా సెల్యూట్ అంటూ వ్యాఖ్యానించారు.

29న బల పరీక్ష
హైకోర్టు తీర్పు నేపధ్యంలో హరీశ్ రావత్ కు మరోసారి సీఎం పదవిని నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. ఈ నెల 29న ఆయన బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ఇప్పటికే తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతోపాటు బీజేపీతో చేతులు కలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో కూడా కాంగ్రెస్ పెద్దలు సమీక్షలు జరిపి బలపరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు