-

ప్రెస్‌మీట్ చాలు.. ఇక వెళ్లి టీ తాగండి: సీఎం

26 Aug, 2016 10:06 IST|Sakshi
ప్రెస్‌మీట్ చాలు.. ఇక వెళ్లి టీ తాగండి: సీఎం

జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి కోపం వచ్చింది. గతంలో మీరు కశ్మీర్‌లో భద్రతాదళాల మోహరింపును, కర్ఫ్యూల విధింపును వ్యతిరేకించారు కదా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆమెకు ఎక్కడ లేని కోపం వచ్చింది. తాను చెప్పదలచుకున్న నాలుగు ముక్కలు చెప్పేసి.. ''థాంక్యూ, ప్రెస్‌మీట్ అయిపోయింది.. ఇక వెళ్లి టీ తాగండి' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సాక్షిగానే ఇదంతా జరిగింది. 2010లో కూడా ఇలాగే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పుడు మీ విధానం వేరుగా ఉంది కదా అని విలేకరులు పదే పదే ప్రశ్నించడంతో ఆమెకు కోపం వచ్చింది. బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం రాష్ట్రంలో హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా ఆమె మీడియా ముందుకు వచ్చారు.

2010 అల్లర్లను నాటి సీఎం ఒమర్ అబ్దుల్లా సరిగా నియంత్రించలేదని, అందుకే వంద మందికి పైగా మరణించారని మెహబూబా చెప్పారు. ప్రస్తుత ఆందోళనను కేవలం 5 శాతం మంది మాత్రమే సమర్థిస్తున్నారని, మిగిలిన 95 శాతం మంది శాంతినే కోరుకుంటున్నారని అన్నారు. అప్పట్లో బూటకపు ఎన్‌కౌంటర్లు, మానవహక్కుల ఉల్లంఘన, అత్యాచారాలు, హత్యలు.. ఇలాంటివన్నీ ఉన్నాయని, వాటికి వ్యతిరేకంగానే అల్లర్లు జరిగాయని చెప్పారు. ఇప్పుడు ముగ్గురు ఉగ్రవాదులను చంపినందుకు అల్లర్లు చేస్తున్నారని.. జనం రోడ్డుమీదకు వస్తున్నందుకే కర్ఫ్యూ పెట్టామని.. అలంటప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపట్టడం ఎందుకని మెహబూబా అడిగారు. ఆర్మీక్యాంపుల మీద దాడి జరిగినప్పుడే వాళ్లు కాల్పులు జరుపుతున్నారని.. అమాయకులైన పిల్లలను అనవసరంగా ఎందుకు వీటిలోకి లాగుతున్నారని ప్రశ్నించారు. ఇదే సమయంలో విలేకరులు పదే పదే ప్రశ్నించడంతో తీవ్ర అసహనానికి గురైన ఆమె.. ప్రెస్‌మీట్‌ను అర్ధంతరంగా ముగించి, ''ఇక చాలు, వెళ్లి టీ తాగండి' అని చెప్పారు.

మరిన్ని వార్తలు