కన్నీళ్లు పెట్టించడానికి సిద్ధమవుతోన్న ఉల్లి..?

17 Oct, 2018 09:36 IST|Sakshi

ముంబై : పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సతమతమవుతోన్న జనాల నడ్డి విరచడానికి ఉల్లిపాయ కూడా సిద్ధమవుతోంది. అతి త్వరలోనే ఉల్లి ధర భారీగా పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కిలో 10 రూపాయలకు లభ్యమవుతోన్న ఉల్లిపాయలు, మరో వారం రోజుల్లోనే దాదాపు 50 రూపాయలకు చేరనున్నట్లు తెలిసింది.

ఈ విషయం గురించి ఏపీఎమ్‌సీ(అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ) అధ్యక్షుడు వశి మాట్లాడుతూ.. ‘ఇన్ని రోజులు మార్కెట్‌కి ప్రతి రోజు దాదాపు 125 - 150 టన్నుల ఉల్లి వచ్చేది. ఇది కూడా ఎక్కువగా నాసిక్‌, పూణె ప్రాంతాల నుంచి వస్తుండేది. కానీ కొన్ని రోజులుగా ఉల్లి దిగుమతి భారీగా తగ్గింది. ప్రసుతం రోజుకు కేవలం 50 టన్నుల ఉల్లి మాత్రమే మార్కెట్‌కి వస్తుంది. కొత్త గడ్డ రావడానికి ఇంకా సమయం పడుతుంది. అందవల్ల మరో వారం రోజుల్లోపే ఉల్లి ధర కిలో 50కి చేరవచ్చు’ అని తెలిపారు.

ప్రస్తుతం నాసిక్‌లో తీవ్ర కరువు పరిస్థితులు ఇందుకు కారణమని వశి వెల్లడించారు. ప్రస్తుతం నాసిక్‌లో తాగడానికే నీరు దొరకడం లేదు. పంటల సాగు తగ్గిపోయింది. దాంతో ఈ ఏడాది ఉల్లి సాగు కూడా బాగా పడిపోయింది. అందువల్లే ఈ అధిక రేటు అని వశి తెలిపారు.

మరిన్ని వార్తలు