‘తలాక్‌’పై రాజకీయాలొద్దు

30 Jan, 2018 01:53 IST|Sakshi
పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడుతున్న మోదీ.

ఏకకాల ఎన్నికలపై చర్చ జరపండి

ఎన్డీఏ పక్ష నేతల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు వీలైనంత త్వరగా ఆమోదం పొందటం ద్వారా ముస్లిం మహిళలకు స్వేచ్ఛా జీవితాన్ని ఇవ్వగలుగుతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ అంశంపై రాజకీయాలు చేయకూడదని అన్ని పక్షాలను ఆయన కోరారు. సోమవారం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఈ సమావేశాల్లో ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018 నూతన సంవత్సర కానుకగా ముస్లిం సోదరీమణులకు ఈ బిల్లును కానుకగా ఇవ్వాలన్నారు. 

అంతకుముందు జరిగిన ఎన్డీఏ పక్షాల భేటీలో మోదీ మాట్లాడుతూ.. ఏకకాల ఎన్నికలకు అనుకూల వాతావరణాన్ని నిర్మాణం చేయటంలో కృషిచేయాలని కోరారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా చర్చను ప్రారంభించాలని సూచించారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఎన్డీయే పక్షాల సభ్యుల పూర్తిస్థాయిలో హాజరవ్వాలని మోదీ కోరారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు, ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లులను ఆమోదింపజేసుకోవటం కీలకమన్నారు. ముఖ్యమైన అంశాలపై ఈసారి సమావేశంలో చర్చించనున్నందున హాజరు శాతం ఎక్కువగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం, ఆసియాన్‌ సదస్సుల్లో మోదీ ప్రసంగాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు. కాగా సోమవారం ముగ్గురు ఆప్‌ ఎంపీలు, ఒక బీజేపీ సభ్యుడు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు.
 

మరిన్ని వార్తలు