మనమే నాయకత్వం వహించాలి!

7 Apr, 2015 01:01 IST|Sakshi
మనమే నాయకత్వం వహించాలి!

పర్యావరణ పరిరక్షణకు ప్రధాని పిలుపు
వాతావరణ మార్పుపై పోరులో కలసిరావడం లేదని పాశ్చాత్య దేశాలు విమర్శిస్తున్నాయి
స్వచ్ఛమైన అణు విద్యుత్
ఉత్పత్తిలో సహకరించకుండా మనపై అభాండాలు వేస్తున్నారు

 
న్యూఢిల్లీ: వాతావరణ మార్పు విషయంలో భారత్‌పై అభాండాలు వేస్తున్నారని అభివృద్ధి చెందిన దేశాలపై ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. పర్యావరణ పరిరక్షణ భారత దేశ సంప్రదాయంలోనే ఒక భాగమని తేల్చిచెప్పారు. ‘వాతావరణ మార్పు, భూ తాపోన్నతిపై పోరులో కలసి రావడం లేదంటూ ఒకవైపు భారత్‌పై అభాండాలు వేస్తున్నారు. మరోవైపు స్వచ్ఛమైన అణువిద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఇంధనాన్ని సమకూర్చమంటూ మనం చేస్తున్న విజ్ఞప్తులను మాత్రం పెడచెవిన పెడ్తున్నార’ంటూ సంపన్న దేశాల వైఖరిని మోదీ ఎండగట్టారు. స్వచ్ఛమైన ఇంధనాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు అవసరమైన పర్యావరణ అనుకూల అణు ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని అంతర్జాతీయ అణు ఇంధన దేశాల కూటమికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాల పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న సదస్సునుద్దేశించి మోదీ సోమవారం ప్రసంగించారు. వాతావరణ మార్పుపై పోరుకు భారత్ కట్టుబడి ఉందన్న ప్రధాని.. భూతాపోన్నతి సమస్యకు పరిష్కారాలను కనుగొనడంలో భారత్ ప్రపంచానికి దారి చూపాలని, వాతావరణ మార్పుపై పోరుకు నేతృత్వం వహించాలని పిలుపునిచ్చారు. ‘ఇతరులు రూపొందించిన నిబంధనలను మనం బలవంతంగా పాటించడం కాదు. ఈ రంగంలో మనకు శతాబ్దాల వారసత్వ అనుభవం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి మనమే ప్రపంచానికి మార్గం చూపగలం. నేతృత్వం వహించగలం’ అని అన్నారు. ‘ప్రపంచమంతా వాతావరణ మార్పుపై ఆందోళన చెందుతూ, ఆ సమస్యకు పరిష్కారాలను వెతికేందుకు కృషి చేస్తుంటే.. భారత్ మాత్రం ఆ కృషికి అడ్డంకులు సృష్టిస్తోందంటూ అంతా అనుకుంటున్నారు. కానీ ప్రకృతిని దైవంగా పూజించే, వాతావరణ పరిరక్షణను దైవకార్యంలా భావించే సంస్కృతి మనది’ అని స్పష్టం చేశారు. సగటు కర్బన ఉద్గారాలు భారత్‌లోనే అతితక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్‌లోని మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం భారీగా ఉంటోందని, అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో ఒకటిగా ఢిల్లీ ఉందని, అందువల్ల ఢిల్లీలోని అనేక ఎంబసీలు, విదేశీ సంస్థలు వాయు శుద్ధి పరికరాలను తమ కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకుంటున్నాయంటూ పాశ్చాత్య దేశాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మోదీ పై వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ. కలసికట్టుగా ప్రగతిపథంలో ముందుకు సాగాలని మోదీ పేర్కొన్నారు.  పౌర్ణమి రోజుల్లో ఇళ్లల్లో దీపాలార్పేయడం, వారానికి ఒకరోజైనా సైకిల్ వాడటం లాంటి చర్యలు చేపట్టాలని మోదీ సూచించారు.

జీవనశైలి వల్లనే.. ప్రజల జీవన శైలిలో వస్తున్న మార్పుల వల్లనే పర్యావరణానికి హాని కలుగుతోందని మోదీ అన్నారు. ప్రజల్లో విపరీతంగా పెరిగిన వినియోగతత్వం పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణమని, వినియోగం పెరుగుతున్న కొద్దీ ప్రకృతి నాశనమవుతూ ఉంటుందని అన్నారు.  

విపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయి:

భూసేకరణ బిల్లు పరిధిలో గిరిజన, అటవీ భూముల అంశాలు లేకున్నా విపక్షాలు ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నాయని మోదీ ఆరోపించారు. దీని వల్ల దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అన్నారు.
 
జాతీయ వాయు స్వచ్ఛత సూచీ ప్రారంభం
 
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వాయు స్వచ్ఛతను ఎప్పటికప్పుడు తెలిపేందుకు, కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన జాతీయ వాయు స్వచ్ఛత సూచీ(ఎన్‌ఏక్యూఐ)ని సోమవారం మోదీ ప్రారంభించారు. ఎన్‌ఏక్యూఐలో భాగంగా ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఆగ్రా, కాన్పూర్, వారణాసి, లక్నో, అహ్మదాబాద్, ఫరీదాబాద్‌లలో వాయుస్వచ్ఛతను నిర్ధారిస్తారు. ఈ సూచీలో ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఒకే రంగు, ఒకే సంఖ్య, ఒకే వివరణ ఉంటుంది. ఎన్‌ఏక్యూఐని 22 రాష్ట్రాల రాజధానులు, 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న 44 పట్టణాలకు కూడా దీన్ని విస్తరిస్తామని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది.
 
 

>
మరిన్ని వార్తలు