అన్‌లాక్‌తో నిర్లక్ష్యం పెరిగింది! 

1 Jul, 2020 04:22 IST|Sakshi

మాస్క్, భౌతికదూరాన్ని కచ్చితంగా పాటించాలి

‘పీఎం గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన’ను కొనసాగిస్తాం

80 కోట్ల పేదలకు ఆహార ధాన్యాలు అందిస్తాం

జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ 

న్యూఢిల్లీ: అన్‌లాక్‌ దశ ప్రారంభమైన తరువాత వ్యక్తిగత, సామాజిక వ్యవహారశైలిలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో చూపిన జాగ్రత్త ఇప్పుడు చూపడం లేదన్నారు. ప్రభుత్వాలు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ముఖ్యంగా కంటైన్‌మెంట్‌ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. దేశ ప్రజలనుద్దేశించి మంగళవారం ఆయన ప్రత్యేకంగా ప్రసంగించారు.  దగ్గు, జలుబు, జ్వరం.. మొదలైనవి ఎక్కువగా వచ్చే సీజన్‌ ప్రారంభమైందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాల్సి ఉందన్నారు.

జూలై 1 నుంచి అన్‌లాక్‌ 2 దశ ప్రారంభమవుతోందని గుర్తు చేసిన ప్రధాని.. కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్‌ ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన ఫలితాలను సాధించిందన్నారు. సరైన సమయంలో లాక్‌డౌన్‌ ప్రకటించడం, లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం.. తదితర కారణాలతో లక్షలాది ప్రాణాలు కాపాడగలిగామన్నారు. వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలంతా మాస్క్‌ ధరించడం, కనీసం రెండు గజాల భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రతను పాటించడం కొనసాగించాలని కోరారు. కరోనా సంక్షోభం ప్రారంభమైన తరువాత ప్రధాని మోదీ దేశానుద్దేశించి ప్రసంగించడం ఇది ఆరోసారి.

నవంబర్‌ వరకు.. 
పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్న ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై)’ పథకాన్ని నవంబర్‌ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో విధించిన లాక్‌డౌన్‌తో పేదల ఉపాధికి ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి కేంద్రం ఈ ఉచిత రేషన్‌ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలను అందిస్తున్నారు.

కుటుంబంలోని ప్రతీ వ్యక్తికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం లేదా గోధుమలు, కుటుంబానికి కేజీ చొప్పున కందిపప్పు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్నారు. ‘జూలై నెల నుంచి పండుగల సీజన్‌ ప్రారంభమవుతోంది. దాంతో ప్రజల అవసరాలు, ఖర్చులు పెరుగుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉచిత రేషన్‌ కార్యక్రమాన్ని నవంబర్‌ నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు. పొడిగించడం వల్ల ఖజానాపై రూ. 90 వేల కోట్ల భారం పడుతుందని, ఏప్రిల్‌ నుంచి లెక్కిస్తే ఆ భారం రూ. 1.5 లక్షల కోట్లు ఉంటుందని వివరించారు.

అమెరికా జనాభా కన్నా ఎక్కువ 
ఉచిత రేషన్‌ పథకం లబ్ధిదారులు దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మంది ఉన్నారని ప్రధాని చెప్పారు. ‘ఈ సంఖ్య అమెరికా జనాభా కన్నా రెండున్నర రెట్లు ఎక్కువ. యూరోపియన్‌ యూనియన్‌ జనాభా కన్నా రెండింతలు ఎక్కువ. యూకే జనాభా కన్నా 12 రెట్లు ఎక్కువ’ అని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. రైతుల కృషి, పన్ను చెల్లింపుదారుల సహకారం కారణంగానే ఈ పథకాన్ని అమలు చేయగలుగుతున్నామన్న ప్రధాని.. వారికి దేశంలోని పేదలందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఙతలు తెలియజేస్తున్నానన్నారు. మరోవైపు, తెలుగు, బెంగాలీ సహా వివిధ భాషల్లో తన ప్రసంగం వినిపించే యూట్యూబ్‌ లింక్‌లను తన ట్విటర్లో ప్రధాని పోస్ట్‌చేశారు.

వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డ్‌ 
దేశవ్యాప్తంగా ఒకే రేషన్‌ కార్డు వినియోగమయ్యే దిశగా చర్యలు ప్రారంభించామని చెప్పారు. సొంతూళ్లను వదిలి ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి దీనివల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించాక పేదల కోసం రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించామన్నారు. అందులో రూ. 31 వేల కోట్లను 20 కోట్ల మంది పేదల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా జమ చేశామని, 9 కోట్ల మంది రైతులకు రూ. 18 వేల కోట్లు అందించామన్నారు. గ్రామాల్లో ఉపాధి కార్యక్రమాలకు రూ. 50 వేల కోట్లనుఖర్చు చేస్తోందన్నారు.

ప్రధానికే ఫైన్‌ వేశారు 
‘బహిరంగ ప్రదేశంలో మాస్క్‌ ధరించకపోవడం వల్ల ఒక దేశంలో సాక్షాత్తూ ఆ దేశ ప్రధానికే సుమారు రూ. 13 వేల జరిమానా విధించారన్న వార్త మీరు చూసే ఉంటారు. మన దగ్గర స్థానిక ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని చూపాలి. ప్రధాని అయినా, గ్రామ సర్పంచ్‌ అయినా, నియమం పాటించాల్సిందే’ అని మోదీ వ్యాఖ్యానించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. నిబంధనలు పాటించనివారిని అడ్డుకుని, హెచ్చరించాలని సూచించారు. జూన్‌ 23న బల్గేరియా ప్రధాని బాయ్‌కొ బొరిసోవ్‌ మాస్క్‌ ధరించకుండా ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో ఆయనకు, ఆయనతో పాటు మాస్క్‌లు లేకుండా ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర అధికారులు, జర్నలిస్టులు అందరికీ అక్కడి ఆరోగ్య శాఖ 300 లీవాలు(సుమారు రూ. 13 వేలు) జరిమానాగా విధించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా