బాధను భరిస్తూ కూర్చోం

24 Feb, 2019 01:30 IST|Sakshi

ఇది కొత్త ఇండియా 

భద్రతాదళాలు వాటి పని అవి చేస్తాయి

పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ పరోక్ష హెచ్చరికలు

పోరాటం కశ్మీర్‌ కోసమేననీ, కశ్మీరీలపై కాదని స్పష్టీకరణ

టోంక్‌ (రాజస్తాన్‌): ఉగ్రవాద దాడుల బాధను భరిస్తూ కూర్చునే ప్రభుత్వం తమది కాదనీ, తప్పక ప్రతీకారం ఉంటుందని ప్రధాని∙మోదీ అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. దళాలు వాటి పని అవి పూర్తి చేస్తాయన్నారు. ప్రభుత్వ పోరాటం కశ్మీర్‌ కోసమే తప్ప కశ్మీర్‌కు వ్యతిరేకంగానో లేక కశ్మీరీలపైనో కాదని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరులో కశ్మీరీ యవతీ యువకులు ప్రభుత్వంతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని మనతోనే ఉంచుకోవాలి తప్ప వారిపై ఎవరూ దాడులు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14న కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడి తర్వాత దేశంలో అక్కడక్కడ కశ్మీరీలపై దాడులు జరిగినట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో మోదీ శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉగ్రవాదం అంతానికే తాము పోరాడుతున్నామనీ, చేతులు ముడుచుకుని కూర్చోబోమని అన్నారు. రాజస్తాన్‌లోని టోంక్‌లో బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ ‘ఉగ్రవాదం అనే ఫ్యాక్టరీ నడుస్తున్నంత కాలం ప్రపంచంలో శాంతి నెలకొనదు. ఆ ఫ్యాక్టరీని నేనే అంతం చేయాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. దాడి తర్వాత మనలో ఎంత కోపం, ప్రతీకారం రగులుతున్నాయో మీరు చూస్తున్నారు. మన కొత్త విధానాల వల్ల పాకిస్తాన్‌ కష్టాలను ఎదుర్కొంటోంది. ఇది కొత్త ఇండియా. మేం బాధను భరిస్తూ నోర్మూసుకుని కూర్చునే రకం కాదు’ అంటూ పాక్‌ను మోదీ పరోక్షంగా హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా సైనికులు కోరుతున్న ఒక ర్యాంకు, ఒక పెన్షన్‌ని తమ ప్రభుత్వం అమలు చేసిందనీ, 20 లక్షల మంది విశ్రాంత సైనికులకు రూ. 11 వేల కోట్ల పాత బకాయిలను చెల్లించిందని చెప్పారు. 

పాక్‌ ప్రధాని మాట నిలబెట్టుకుంటారా? 
‘ఇమ్రాన్‌ ఖాన్‌ పాక్‌ కొత్త ప్రధానిగా ఎన్నికైనప్పుడు మర్యాదపూర్వకంగా ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పా. ఇన్నాళ్లూ పోట్లాడుకున్నామనీ, ఇకపై చేతులు కలిపి పేదరికం, నిరక్షరాస్యతలను రూపుమాపేందుకు కృషి చేద్దామని కోరా. అందుకు ఆయన ఒప్పుకుంటూ తాను పఠాన్‌ల కుమారుడిననీ, అబద్ధాలు చెప్పనని అన్నారు. మరి ఆ మాటను ఇప్పుడు ఆయన నిలబెట్టుకుంటారో లేదో చూడాలి’ అని మోదీ అన్నారు. ‘మన దేశంలో నివసిస్తున్న కొందరు ప్రజలు పాకిస్తాన్‌ భాషలో మాట్లాడటం నన్ను బాధిస్తుంది. మీరు ఏమైనా చేయండి, మోదీని పదవి నుంచి దింపేయండి అని పాకిస్తాన్‌కు వెళ్లి చెప్పొచ్చేది వీళ్లే. ముంబైలో ఉగ్రవాద దాడికి పాల్పడిన వారికి సమాధానం ఇవ్వలేని వాళ్లే వీళ్లు’ అని మోదీ కాంగ్రెస్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘ఉగ్రవాద చర్యల్లో కశ్మీర్‌లోని పాఠశాలలు తగలబడి పోకుండా చూసుకోవాలని గతంలో కశ్మీర్‌ సర్పంచ్‌లను కోరా. తమ ప్రాణాలైనా అడ్డుపెట్టి పాఠశాలలు తగలబడకుండా అడ్డుకుంటామని హామీనిచ్చారు.  రెండేళ్లలో ఒక్క పాఠశాల కూడా కశ్మీర్‌ లోయలో నాశనం కాలేదని చెప్పడానికి గర్వపడుతున్నా’ అన్నారు. 

స్వాగతించిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 
కశ్మీరీలపై దాడులను నిరసిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలను నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లాలు స్వాగతించారు. దాడులను ఖండించడంలో మోదీ ఆలస్యంగా స్పందించారనీ, ఇప్పటికైనా దాడులు వద్దంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని స్వాగతిస్తున్నామని ఓ ప్రకటన ద్వారా వారు తెలిపారు. అయితే మాటల్లో చెప్పడం కాకుండా దాడులను నివారించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. 

అవినీతికి బదులు అత్యధిక వృద్ధి రేటు 
ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ వాణిజ్య సదస్సులోనూ మోదీ మాట్లాడారు. గతంలో కాంగ్రెస్‌ పాలనలో అవినీతిలో పోటీ ఉండేదనీ, ఇప్పుడు తమ ప్రభుత్వం 1991 నాటి ఆర్థిక సంస్కరణల తర్వాత ఎన్నడూ లేనంత అత్యధిక సగటు వృద్ధి రేటును, అత్యల్ప సగటు ద్రవ్యోల్బణాన్ని సాధించిందని మోదీ చెప్పారు. ఇండియాను 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చేందుకు తమ ప్రణాళికలను మోదీ వివరించారు. 

మరిన్ని వార్తలు