‘హాట్‌ స్పాట్స్‌’ కాని ప్రాంతాల్లో..!

7 Apr, 2020 04:34 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మోదీ

లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ప్రధాని మోదీ సంకేతాలు

ఎకానమీపై కరోనా ప్రభావాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టండి

లాక్‌డౌన్‌ అనంతర కార్యాచరణపై ప్రణాళికలు రూపొందించండి

కేంద్ర కేబినెట్‌ భేటీలో మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 14 తరువాత లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి సంకేతాలిచ్చారు. దేశవ్యాప్తంగా వైరస్‌ హాట్‌స్పాట్స్‌ కాని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను క్రమానుగతంగా ఉపసంహరించేలా ప్రణాళిక రూపొందించాలని కేంద్ర మంత్రులకు సూచించారు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా కూడా గత గురువారం ప్రధాని లాక్‌డౌన్‌ ఎత్తివేత దిశగా సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక రంగంపై కరోనా ప్రతికూల ప్రభావం అత్యంత కనిష్ట స్థాయిలో ఉండేలా లాక్‌డౌన్‌ అనంతరం వివిధ మంత్రిత్వ శాఖలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ ప్రకటన అనంతరం తొలిసారి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని కేబినెట్‌ భేటీ నిర్వహించారు.

వ్యవసాయ రంగంపై కరోనా ప్రభావం గురించి ఈ భేటీలో చర్చించారు. పంట కోతల సమయంలో రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని ప్రధాని కోరారు. ‘రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ఈ పంట కోతల సమయంలో సాధ్యమైనంత సాయాన్ని వారికి ప్రభుత్వం అందించాలి’ అని స్పష్టం చేశారు. పంటలను మార్కెట్లకు చేర్చేందుకు సాంకేతికత సాయం తీసుకోవాలని, క్యాబ్‌ సర్వీస్‌ అగ్రిగేటర్ల తరహాలో ట్రక్‌ సర్వీస్‌ అగ్రిగేటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చేమో ఆలోచించాలని సూచించారు. గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులను సేకరించే విషయంపైన కూడా దృష్టి పెట్టాలన్నారు. ఈ సంక్షోభ సమయాన్ని ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ను ప్రోత్సహించేందుకు, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు లభించిన ఒక అవకాశంగా భావించాలని ప్రధాని సూచించారు.

కరోనాతో అతలాకుతలమైన ఆర్థిక రంగాన్ని పునరుత్తేజపరిచేందుకు మంత్రిత్వ శాఖలు ‘వ్యాపార కొనసాగింపు ప్రణాళిక’లను సిద్ధం చేయాలని ప్రధాని ఆదేశించారు. లాక్‌ డౌన్‌ అనంతరం అమలు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన 10 నిర్ణయాలను, 10 ప్రాధాన్య రంగాలను గుర్తించాలని మంత్రిత్వ శాఖలకు విజ్ఞప్తి చేశారు. అలాగే, తమ తమ మంత్రిత్వ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న సంస్కరణలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, దేశీయంగా ఉత్పత్తులను పెంచడం, తద్వారా ఎగుమతులను పెంచేందుకు ఆచరణపూర్వక సూచనలు ఇవ్వాలని మంత్రులను కోరారు. కొత్తగా ఏయే ఉత్పత్తులను ఎగుమతి చేయొచ్చో, ఏయే దేశాలకు ఎగుమతి చేయొచ్చో ఆలోచించాలన్నారు.

అదే సమయంలో దేశీయంగా నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా చూడాలని మంత్రులను కోరారు. బ్లాక్‌ మార్కెట్‌ను, ధరలను అక్రమంగా పెంచడాన్ని అడ్డుకునే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం సమర్థవంతంగా అమలు జరిగేలా చూడాలని కోరారు. ఈ పథకం ప్రయోజనాలు లబ్ధిదారులకు కచ్చితంగా అందేలా చూడాలన్నారు. ప్రధాని నివాసంలో ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, హోంమంత్రి అమిత్‌ షా, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగతా మంత్రులు తమ కార్యాలయాలు, నివాసాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇది సుదీర్ఘ పోరాటం: మోదీ
కరోనా వైరస్‌పై భారత్‌ సుదీర్ఘ పోరు జరపాల్సి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పోరాటంలో అంతిమంగా భారత్‌ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. బీజేపీ 40వ వ్యవస్థాపక దినం సందర్భంగా ప్రధాని పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ‘ఈ పోరాటం సుదీర్ఘ కాలం కొనసాగనుంది. అలసట చెందినట్లు గానీ, ఓటమి పాలయినట్లు గానీ మనం భావించరాదు. ఈ పోరాటంలో మనం విజయం సాధిస్తాం. విజేతలుగా నిలుస్తాం. కరోనా మహమ్మారిపై గెలుపు సాధించడమే యావత్‌ జాతి లక్ష్యంగా పెట్టుకుంది. కోవిడ్‌–19 తీవ్రతను అర్థం చేసుకుని సరైన సమయంలో సమగ్ర చర్యలు అమలు చేస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి.   భారత్‌ తీసుకున్న చర్యలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు చూపిన పరిణతి అపూర్వం. భారత్‌ వంటి పెద్ద దేశంలో ప్రజలు ఇలా క్రమశిక్షణ  చూపుతారని ఎవరూ ఊహించి ఉండరు’ అని ప్రధాని అన్నారు.

మరిన్ని వార్తలు