భద్రతపై ప్రత్యేక దృష్టి

8 Jan, 2018 02:24 IST|Sakshi

డీజీపీ, ఐజీపీలతో మోదీ భేటీ

కశ్మీర్, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని సూచన

టెకాన్‌పూర్‌: దేశ అంతర్గత భద్రతపై సమీక్షతోపాటుగా భవిష్యత్తులో భద్రతను మరింత పటిష్టపరచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. దేశంలోని పోలీసు ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా చర్చించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ సమీపంలోని బీఎస్‌ఎఫ్‌ అకాడమీలో జరుగుతున్న డీజీపీలు, ఐజీల వార్షిక సదస్సు లో మోదీ పాల్గొన్నారు. ఆదివారం దినమంతా మోదీ అధికారులతో విస్తృతమైన చర్చలు జరిపారు. ‘పోలీసింగ్, భద్రత అంశాలపై పోలీసు అధికారులతో చర్చించాను. ఈ సమావేశం ఫలప్రదంగా జరిగింది. మూడేళ్లుగా తీసుకున్న నిర్ణయాల అమలుతీరుపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు’ అని మోదీ ట్వీట్‌ చేశారు. సోమవారం కూడా పోలీసు ఉన్నతాధికారులతో మోదీ సమావేశం కొనసాగనుంది.

సదస్సు వివరాలు పూర్తిగా వెల్లడికానప్పటికీ.. దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేయటంతోపాటుగా జమ్మూకశ్మీర్, ఈశాన్యరాష్ట్రాలు, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్లాలని మోదీ అధికారులకు సూచించినట్లు తెలిసింది. దాదాపు 250 మంది రాష్ట్రాల పోలీసు బాస్‌లు, కేంద్రీయ పోలీసు బలగాల సంస్థల అధిపతులు మూడ్రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. శనివారం కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభోపన్యాసం చేస్తూ.. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రస్థావరాలు ఇంకా దేశంలో అక్కడక్కడ బయటపడుతున్నాయన్నారు. కశ్మీర్‌లో యువతను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్‌ ప్రతిక్షణం ప్రయత్నిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక కేంద్రాలను అపవిత్రం చేసే ప్రయత్నాలు, అక్కడ అల్లర్లకు ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరించాలని రాజ్‌నాథ్‌ ఆదేశించారు.

గతేడాది హైదరాబాద్‌.. ఈసారి గ్వాలియర్‌
ప్రతి ఏడాదీ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, కేంద్రీయ బలగాల ఉన్నతాధికారులు సమావేశమై దేశవ్యాప్తంగా ఉన్న భద్రతాపరమైన అంశాలపై చర్చిస్తారు. మామూలుగా ఈ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక. ఢిల్లీ బయట వేర్వేరు కేంద్రాల్లో ఈ సమావేశం ఏర్పాటుచేస్తోంది. 2014లో గువాహటిలో, 2015లో రణ్‌ ఆఫ్‌ కచ్, 2016లో హైదరాబాద్‌లో ఈ సదస్సు జరిగింది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాద ప్రేరేపిత అంశాలపై విస్తృత చర్చ జరిగింది. 

మరిన్ని వార్తలు