ఆయుష్మాన్‌ భారత్‌కు శ్రీకారం

23 Sep, 2018 16:29 IST|Sakshi
జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

రాంచీ : దేశంలో నిరుపేదలకు ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన వరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జార్ఖఃడ్‌ రాజధాని రాంచీలో ఆదివారం  కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా ఆయుష్మాన్‌ భారత్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ తరహా భారీ హెల్త్‌కేర్‌ కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే తమ ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని అమలు చేయగలిగిందని చెప్పారు.

దేశంలో 50 కోట్ల మంది పేదల ఆశీస్సులతో అధికారుల బృందం రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతుందన్నారు. దేశవ్యాప్తంగా 13,000 ఆస్పత్రులు ఈ కార్యక్రమంలో భాగస్వామలుగా చేరాయన్నారు. గరీబీ హఠావో అని నినదించిన నేతలు నిజానికి పేదల సంక్షేమానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదని కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని  ప్రధాని విమర్శలు గుప్పించారు.

పేదల సమస్యలను ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్‌ వారి ఆత్మగౌరవాన్నీ విస్మరించిందన్నారు. తప్పుడు హామీలతో పేదలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించిందని ఆరోపించారు. కుల, మత విచక్షణ లేకుండా అందరికీ అభివృద్ధి అందాలనే ఉద్దేశంతోనే ఆయుష్మాన్‌ భారత్‌కు శ్రీకారం చుట్టామన్నారు.

మరిన్ని వార్తలు