ఎంపీలు శత్రువులు కారు

12 Aug, 2017 00:49 IST|Sakshi
ఎంపీలు శత్రువులు కారు

రాజకీయ, సిద్ధాంతపరమైన విభేదాలుంటాయంతే
►  ఆందోళనల మధ్య బిల్లుల ఆమోదానికి వ్యతిరేకం
► నేనూ విమర్శలు చేశాను కానీ హద్దులు దాటలేదు
► రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణలో వెంకయ్య వ్యాఖ్య
► పేదలకు రాజ్యాంగ పదవులు ప్రజాస్వామ్య గొప్పదనమన్న మోదీ


న్యూఢిల్లీ: ప్రజాసమస్యలపై నాణ్యమైన చర్చ జరిగే హుందాతనం కలిగిన సభ రాజ్యసభ అని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. చట్టసభల్లో జరగాల్సినవి నిర్మాణాత్మక చర్చలే కానీ ఆందోళనలు, నిరసనలు కాదని ఆయన తెలిపారు. శుక్రవారం రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా  ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పేదలు, సామాన్యులకు రాజ్యాంగ ఉన్నత పదవులు అందటమే భారత ప్రజాస్వామ్య గొప్పదనమని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వెంకయ్య తన పదవికి న్యాయం చేస్తారని అభిలషించారు. అంతకుముందు, వెంకయ్య మాట్లాడుతూ.. రాజ్యసభలో అంశాలపై విస్తృత చర్చ జరగాలని.. ఆందోళనలు, నిరసనలు కాదని వ్యాఖ్యానించారు.

‘సభలో అంశాలపై చర్చ జరగాలి. పదేపదే సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగించటాన్ని మానుకోవాలి. ఆందోళనలు, నిరసనల మధ్య బిల్లులు ఆమోదం పొందటాన్ని నేనెంతమాత్రం అంగీకరించను’ అని వెంకయ్య స్పష్టం చేశారు. సభలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు రాజకీయ, సిద్ధాంతపరమైన విభేదాలున్న వారే కానీ.. శత్రువులు కాదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని కోరారు. ఓ రైతు బిడ్డగా సభను నడిపించే అవకాశం రావటం గొప్ప అదృష్టమని వెంకయ్య తెలిపారు. ‘ఏదేమైనా.. దేశ సంస్కృతి (కల్చర్‌) వ్యవసాయమే (అగ్రికల్చర్‌) కదా’ అని తనదైన స్టైల్లో ఆయన తెలిపారు.

‘చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయా. మా అమ్మ ముఖం కూడా నాకు గుర్తులేదని’ వెంకయ్య ఉద్వేగంగా పేర్కొన్నారు. ‘నేను ఇప్పుడు అందరివాడిని. పార్టీ రాజకీయాలకు అతీతమైన వాడిని. రాజ్యసభలో కీలకాంశాలపై అన్ని పార్టీల సభ్యులు తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉండాలి. అందరూ నియమ, నిబంధనలు పాటిస్తే అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది. సమయపాలన చాలా ముఖ్యం’ అని వెంకయ్య తెలిపారు. ‘రాజ్యసభలో వివిధ అంశాలపై నాణ్యమైన చర్చ జరిగే హుందాతనం కలిగిన సభ’ అని వెంకయ్య పేర్కొన్నారు.

తాను విపక్షంలో ఉన్నప్పుడు చాలా విషయాలను లేవనెత్తినట్లు చెప్పిన వెంకయ్య.. ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పటికీ ఎప్పుడూ హద్దులు దాటలేదన్నారు. అంతకుముందు రాజ్యసభ అధ్యక్షుడు జైట్లీ మాట్లాడుతూ.. రాజకీయ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎదిగిన క్రమాన్ని గుర్తుచేశారు. 20 ఏళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా విస్తృతమైన అనుభవం ఉన్న వెంకయ్య సభను సమర్థవంతంగా నడిపిస్తారని అన్నారు.

సంచలనాలొద్దు: మీడియాకు వెంకయ్య హితవు
సభలో జరిగే అంశాలను సంచలనాత్మకం చేయటం మానుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియాకు హితవు పలికారు. సభలో జరిగిన నిర్మాణాత్మక చర్చలను రిపోర్టు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తన అనుభవాన్ని వెంకయ్య గుర్తుచేశారు. ‘చాలా ఏళ్ల క్రితం ఔత్సాహిక పార్లమెంటు సభ్యుడిగా.. దేశంలో వ్యవసాయ సమస్యలపై లోతైన చర్చలో పాల్గొన్నాను. గంటసేపు మాట్లాడాను. ఆ తర్వాత చాలా మంది ఎంపీలు నా దగ్గరికొచ్చి అభినందించారు. కానీ అనూహ్యంగా మరుసటి రోజు పేపర్లలో ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించారు. ఒక పేపర్లో మాత్రం వెంకయ్యనాయుడు వ్యవసాయంపై ధాటిగా మాట్లాడారని ఒక ముక్క రాశారు’ అని వెంకయ్య తెలిపారు.

స్వతంత్రానికి ధనికులూ పోరాడారు: ఆజాద్‌
పేద కుటుంబాల నుంచి వచ్చిన వారు రాజ్యాంగ ఉన్నతపదవులు చేపట్టడం ప్రజాస్వామ్య బలమన్న మోదీ వ్యాఖ్యలపై రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ పరోక్షంగా స్పందించారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో మోతీలాల్‌ నెహ్రూ వంటి ధనికులు కూడా తమ ఆస్తులను వదులుకుని, జైళ్లలో మగ్గిన విషయాన్ని మరిచిపోలేమన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్యను శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అభినందించారు.

విద్యార్థి నాయకుడిగా ఉన్న  వెంకయ్య మళ్లీ తనలాంటి విద్యార్థులున్న క్లాస్‌ (రాజ్యసభ) కే తిరిగొచ్చారన్నారు. ‘మీ క్లాస్‌లో విద్యార్థులు మంచివారు. మిమ్మల్నెవరూ ఇబ్బంది పెట్టరు. మీ రక్తపోటును పెంచరని నేను భరోసా ఇస్తున్నా’ అని రౌత్‌ పేర్కొన్నారు. వెంకయ్యకున్న వాక్పటిమను టీఆర్‌ఎస్‌ సభ్యుడు కె. కేశవరావు ప్రశంసించారు. రాజ్యసభలోకి వెంకయ్య హాస్యాన్ని కూడా తీసుకొస్తారని విశ్వసిస్తున్నానన్నారు. చాలా మంది సభ్యులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం
చేశారు.

ఇది ప్రజాస్వామ్య గొప్పదనం: మోదీ
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వెంకయ్య నాయుడు ఉన్నత రాజ్యాంగ పదవులను అధిరోహించటం భారత ప్రజాస్వామ్యం గొప్పదనమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర భారతంలో పుట్టిన తొలి ఉపరాష్ట్రపతి వెంకయ్యేనని ఆయన పేర్కొన్నారు. ఎంపీగా సుదీర్ఘ అనుభవం ఉన్న వెంకయ్యకు పార్లమెంటరీ వ్యవహారాల్లో, సభ నడపటంలో ఉండే చిక్కులు తెలుసని మోదీ అన్నారు.

జయప్రకాశ్‌ నారాయణ్‌ ఇచ్చిన పిలుపుతో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న నాయుడు.. అంచెలంచెలుగా రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిని అందుకున్నారని ప్రధాని ప్రశంసించారు. ‘నేడు అన్ని రాజ్యాంగబద్ధ పదవులు రైతులు, సామాన్య ప్రజల పిల్లలే అధిరోహించారు’ అని ప్రధాని పేర్కొన్నారు. చాలా ఏళ్లు ప్రజాజీవితంలో గడిపిన తొలి ఉపరాష్ట్రపతి వెంకయ్య ఒక్కరే అయి ఉండొచ్చని మోదీ ప్రశంసించారు. సభ నిర్వహణలో విపక్షాల ప్రశంసలు కూడా వెంకయ్య అందుకుంటారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతుకుటుంబం నుంచి..
భారత ఉపరాష్ట్రపతిగా శుక్రవారం ప్రమాణంచేసిన వెంకయ్యనాయుడు 1949 జూలై1న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో రైతు కుటుంబంలో జన్మించారు. నెల్లూరులోని వీఆర్‌ హైస్కూలులో చదువుకున్నారు. అక్కడి వీఆర్‌ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రవర్సిటీ లా కాలేజీలో న్యాయశాస్త్రం పట్టా పుచ్చుకున్నారు. 1974లో జయప్రకాశ్‌ నారాయణ్‌ సారథ్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని తొలిసారిగా వెంకయ్య తన రాజకీయజీవితాన్ని మొదలుపెట్టారు.

ఉదయగిరి నియోజకవర్గం నుంచి 1978, 1983లలో ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1998, 2004, 2010, 2016లలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1999లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2014 నుంచి పట్టణాభివృద్ధి, గృహ, పట్టణప్రాంత పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ శాఖల మంత్రిగా ఉంటూనే 2015లో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా 2002 నుంచి రెండేళ్లపాటు పనిచేశారు. 

మరిన్ని వార్తలు