10 నుంచి ప్రధాని విదేశీ పర్యటన

7 Mar, 2015 01:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 10వ తేదీనుంచి మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. సీషెల్స్, మారిషస్, శ్రీలంక దేశాల్లో ప్రధాని పర్యటిస్తారని శుక్రవారం విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే గతంలో మాల్దీవుల్లో కూడా ప్రధాని పర్యటిస్తారని ప్రకటించగా, ఈ సారి దాని గురించి ఎలాంటి ప్రస్తావన కనిపించలేదు. 2015లో ప్రధాని విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈనెల 14వ తేదీవరకు ప్రధాని పర్యటన ఉంటుందని విదేశాంగశాఖ ప్రకటన పేర్కొంది. ప్రధాన మంత్రి మొదట సీషెల్స్‌కు వెళతారని, అనంతరం 11, 12 తేదీల్లో మారిషస్‌లో పర్యటిస్తారని విదేశాంగశాఖ తెలిపింది. 13, 14 తేదీల్లో శ్రీలంక పర్యటన ఉంటుందని వివరించింది.

ఐపీకేఎఫ్ స్మారకం వద్ద ప్రధాని నివాళి
ప్రధాని నరేంద్రమోదీ శ్రీలంక పర్యటన సందర్భంగా ఆ దేశంలో శాంతిస్థాపనకోసం వెళ్లి అంతర్యుద్ధంలో అమరులైన సుమారు 1,140 మంది భారత సైనికుల స్మారకార్థం నిర్మించిన స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అంతేకాక ఆయన అనురాధపుర, తలైమన్నార్, జాఫ్నాల్లో కూడా పర్యటించనున్నారు. జాఫ్నాలో పర్యటించిన తొలి భాతర ప్రధాని మోదీయే అవుతారని శ్రీలంక విదేశాంగశాఖ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు