ప్రత్యామ్నాయ పంటలతోనే ఢిల్లీ కాలుష్యానికి చెక్‌

6 Nov, 2019 01:24 IST|Sakshi
పంజాబ్‌లోని అట్టారి వద్ద వరి వ్యర్థాల్ని తగులబెడుతున్న రైతులు

ప్రధాని సమీక్షా సమావేశంలో వివిధ సంస్థల ప్రతిపాదనలు

న్యూఢిల్లీ: గాలి కాలుష్యంతో వారం రోజులుగా ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం ఉత్తర భారతంలో కాలుష్య పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ, పంజాబ్, హరియాణా ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ పి.కె. మిశ్రా రెండు రోజులుగా జరిపిన వరుస సమావేశాలనంతరం ప్రధాని మొత్తంగా పరిస్థితుల్ని సమీక్షించారు. శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పొరుగున ఉన్న పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాలను కాల్చడమే కారణమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో రైన్‌ఫెడ్‌ ఏరియా అథారిటీ (ఎన్‌ఆర్‌ఏఏ), కొన్ని ప్రతిపాదనలు చేసింది.

కేవలం వరిపైనే ఆధారపడకుండా వివిధ రకాల ఇతర పంటల్ని పండించడానికి రైతుల్ని మళ్లిస్తే పంట వ్యర్థాల్ని కాల్చడం తగ్గుతుందని ఎన్‌ఆర్‌ఏఏ సీఈవో అశోక్‌ దాల్వాయ్‌ పేర్కొన్నారు. తద్వారా ఢిల్లీ వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయొచ్చునని తెలిపారు. వరి దేశంలో అన్ని చోట్లా పండుతుందని అలాంటప్పుడు వరి పంటకి బదులు గోధుమ వంటి ఇతర పంటలవైపు రైతుల్ని మళ్లించడానికి ప్రోత్సాహకాల్ని ఇస్తే పంట వ్యర్థాల దహనం తగ్గుతుందని అన్నారు. తక్కువ కాల వ్యవధిలో చేతికొచ్చే వరిలో ఇతర రకాల్ని పండించడానికి రైతులు మొగ్గుచూపేలా చర్యలు తీసుకుంటే సెప్టెంబర్‌ నాటికల్లా పంట చేతికొస్తుందని, అప్పుడు శీతాకాలంలో పంట వ్యర్థాల్ని కాల్చడమనే సమస్య ఉత్పన్నం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

పంట వ్యర్థాల్ని ఎరువులుగా మార్చాలి  
ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భాగెల్‌ పంట వ్యర్థాల్ని పొలాల్లో ఎరువులుగా మారిస్తే ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచించారు. çహరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ పంట వ్యర్థాల్ని కాల్చడమనేది కాలుష్యానికి 20 శాతం మాత్రమే కారణమని, వాటిని తగులబెట్టకుండా రైతులకు ప్రత్యామ్నాయాల్ని చూపిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది రైతులకు పంట వ్యర్థాలను నిర్వీర్యం చేసే 15 వేల మిషన్లను ఇప్పటి వరకు పంపిణీ చేశామన్నారు. ఇక పంజాబ్‌లో వరి పంట నుంచి వచ్చే గడ్డిని కాల్చే బదులుగా దానిని సేకరించి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఆవుల మేతకు తరలించాలని అఖిల భారత కిసాన్‌ యూనియన్‌ సమన్వయ కర్త యుధ్‌వీర్‌ సింగ్‌ ప్రభుత్వానికి సూచించారు. 

పెరిగిన వాయు వేగం.. తగ్గిన ఢిల్లీ కాలుష్యం
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాలి వేగం గంటకి 40 కి.మీ.లకు పెరగడంతో కాలుష్యం తగ్గుముఖం పట్టింది. గాలిలో నాణ్యత సూచి మంగళవారం 365 నుంచి మధ్యాహ్నం 331కి తగ్గింది.. ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌ పరిధిలో గ్రేటర్‌ నోయిడా, ఫరీదాబాద్‌ గుర్‌గావ్, ఘజియాబాద్‌ ప్రాంతాల్లో కూడా పరిస్థితి కాస్త మెరుగైంది. ‘పశ్చిమాదిన ఏర్పడిన మహా తుపాను పరిస్థితులు, వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే రెండు మూడు రోజుల్లో వాయవ్య భారతంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ, కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజా»Œ ,æహరియాణా, రాజస్తాన్, యూపీలో ఈదురుగాలులతో వర్షాలు కురవడం వల్ల కాలుష్యం తగ్గే అవకాశం ఉంది’అని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు