ప్రధాని ప్రకటన చేయాల్సిందే

18 Dec, 2014 03:17 IST|Sakshi
  • మతమార్పిళ్లపై రాజ్యసభలో పట్టువీడని విపక్షం  
  • వీహెచ్ ఒకరోజు సస్పెన్షన్
  • సాక్షి, న్యూఢిల్లీ: మత మార్పిళ్లు న్యాయబద్ధమేనని ప్రభుత్వం అంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీయే ఈ విషయమై రాజ్యసభలో ప్రకటన చేయాలన్న విపక్షాలు పట్టువీడలేదు. మూడో రోజూ ఈ విషయమై సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. బుధవారం కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యుల ఆందోళన కారణంగా సభ పలుమార్లు వాయిదాపడింది. ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని, ప్రధాని వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు.

    సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. మతమార్పిళ్లపై దేశమంతటా ఆందోళన వ్యక్తమవుతుండగా ప్రధాని మాత్రం స్పందించడం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం.. ప్రధానమంత్రి, ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎన్సీపీ ఎంపీ మజీద్ మెనన్, కాంగ్రెస్ నేత అశ్వినీకుమార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార బీజేపీ ఎంపీలు మతమార్పిళ్లపై చేస్తున్న వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని జోక్యం చేసుకుని ప్రకటన చేయాలని కోరారు.

    అయితే, కాంగ్రెస్ సభ్యుడు వి.హనుమంతరావు ఇదే డిమాండ్‌తో వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభాపతి స్థానంలో ఉన్నారు. ఈ సందర్భంలో ‘ప్రైం మినిస్టర్ కో బులావో’ అంటూ ఏకవచనంలో సంబోధించారని, అన్ పార్లమెంటరీ భాష వాడారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో చైర్మన్ నిబంధన 255 కింద వీహెచ్‌ను ఒక రోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నిబంధన కింద చైర్మన్ సభ్యుడి పేరు చదివినప్పుడు ఆ రోజులో తదుపరి సమయం సభకు హాజరు కాకూడదు.
     
    ‘గుడ్‌గవర్నెన్స్’పై దద్దరిల్లిన లోక్‌సభ

    క్రిస్‌మస్ పండుగ రోజున పాఠశాలలను తెరిచి ఉంచాలనే ప్రభుత్వ ఉత్తర్వులపై లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టిస్తోందని, సంఘ పరివార్ ఎజెండాను అమలు చేయాలని చూస్తోందని విపక్షాలు విరుచుకుపడ్డాయి. 25న గుడ్‌గవర్నెన్స్‌పై వివిధ కార్యక్రమాలు నిర్వహించి, ఆ మేరకు వాటి వీడియోలు తీసి పంపాలని తెలుపుతూ వెలువడిన ఉత్తర్వులను కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ సభలో చదివి వినిపించారు. ఈ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సమాధాన మిచ్చారు. క్రిస్‌మస్ సెలవు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవటం లేదన్నారు.
     

మరిన్ని వార్తలు