ఆన్‌లైన్‌లో జైలు బిర్యానీ!

12 Jul, 2019 08:05 IST|Sakshi

కేరళలోని వియ్యూరు జైలులో వినూత్న ప్రయోగం

వేడి వేడి బిర్యానీ తినాలనుందా? వెరైటీగా అరిటాకులోనా? అది కూడా కేవలం 127 రూపాయలకే. అయితే కేరళలోని వియ్యూరు సెంట్రల్‌ జైలుకి ఆర్డర్‌ ఇవ్వాలి. అక్కడి జైలు అధికారులు ఖైదీలతో నోరూరించే వేడి వేడి బిర్యానీలను తయారుచేయించి స్థానిక ప్రజలకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టే సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తొలి దశలో బిర్యానీ కాంబో ధరని 127 రూపాయలుగా నిర్ణయించారు. నాణ్యత కు నాణ్యతా, రుచికరమైన బిర్యానీ అతి తక్కువ ధరలో అం దుబాటులోకి రావడంతో కేరళలోని వియ్యూరు ప్రజలు జైలు బిర్యానీ కోసం ఎగబడుతున్నారు. 300 గ్రాముల బిర్యానీ, ఒక రోస్టెడ్‌ చికెన్‌ లెగ్‌ పీస్, మూడు చపాతీలూ, ఒక కప్‌ కేక్, సలాడ్, పచ్చడి, ఒక లీటర్‌ వాటర్‌ బాటిల్‌తో పాటు సాంప్రదాయబద్ధంగా అరిటాకుని కూడా ప్యాక్‌ చేసి కాంబో ప్యాక్‌లో ఇస్తారు.

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ తో ఒప్పందం చేసుకుని జైలు నుంచి పార్శిళ్లను వినియోగదారుల ముంగిళ్లలోకి చేర్చే ఏర్పాటు చేశారు జైలు అధికారులు. కేరళ జైళ్లలోని ఖైదీలు తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను ఫ్రీడం ఫుడ్‌ ఫ్యాక్టరీ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా 2011 నుంచే అమ్మకానికి పెడుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో అమ్మకాలు మాత్రం ఇదే తొలిసారి అని వియ్యూరు సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ నిర్మలానందన్‌ నాయర్‌ వెల్లడించారు. 2011 నుంచి ఖైదీలు చపాతీలు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. ప్రస్తుతం 100 మంది ఖైదీలు రోజుకి 25,000 చపాతీలు, 500 బిర్యానీలు తయారు చేస్తుండటం జైలు అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరిన్ని వార్తలు