ఖైదీల‌ను తాకిన క‌రోనా సెగ‌

28 Mar, 2020 20:25 IST|Sakshi

 విడుద‌ల చేయండంటూ మొర పెట్టుకుంటున్న ఖైదీలు

శ్రీనగర్‌ : క‌రోనా వైరస్‌ మహమ్మారి సెగ ఖైధీల‌ను తాకింది. కోవిడ్‌-19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో జమ్ము ప్రాంతంలొని వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలు త‌మ‌ను తాత్కాలికంగా విడుద‌ల చేయాల‌ని అభ్యర్థించారు. ఈ మేర‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేయాల్సిందిగా జమ్మూకాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తిని కోరారు. సాధార‌ణ ప‌రిస్థితుల్లోనే అక్కడ వైద్య స‌దుపాయాలు అంతంత మాత్రంగా ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఫ్లూ లాంటివి ప్ర‌బ‌లినా దాన్ని ఎదుర్కొనేందుకు త‌గిన వైద్య‌సిబ్బంది ప్ర‌స్తుతం అక్క‌డ లేరు. ప్రాణాంతక క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ప్ర‌స్తుత పరిస్థితి దృష్ట్యా ష‌ర‌తుల‌తో కూడిన కార‌ణాల‌తో విడుద‌ల చేయాల్సిందిగా ఖైదీలు జైలు సూప‌రిండెంట్ ద్వారా విన్న‌వించుకున్నారు.
(చదవండి : రాష్ట్రాల వారిగా కరోనా కేసులు)

దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించినందున త‌మ కుటుంబాలను కూడా క‌లిసే ప‌రిస్థితులు లేవు. అంతేకాకుండా జైలులో ఉన్న ఖైదీలతో కనీసం ఒకరైనా ఈ వైరస్‌ బారిన పడ్డా.. చాలా తొందరగా మిగతా ఖైదీలకు కూడా సోకే ప్రమాదం ఉందని, తమకు బెయిల్‌ ఇచ్చి విడుదల చేయాలని న్యాయస్థానాలకు ఖైదీలు విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్ప‌టికే అనేక రాష్ర్టాలు ఖైదీల‌ను పెరోల్ లేదా ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌తో విడుద‌ల చేశాయి.  పంజాబ్‌లో సుమారు 6వేల మంది ఖైదీల‌ను విడుద‌ల చేయ‌బోతుండ‌గా, దాదాపు ప‌ద‌కొండు వేల‌మంది దోషులు, అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీల‌ను మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌నుంది. ఇదిలా ఉండ‌గా, శ‌నివారం  ఒక్క‌రోజే క‌శ్మీర్‌లో ఏడు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు 20 కేసులు న‌మోద‌య్యాయి.

మరిన్ని వార్తలు