మెట్రోకు భూమిపూజ

26 Aug, 2014 22:22 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబై మెట్రో-3 ప్రాజెక్టు పనులకు మంగళవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్, ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితర  ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పుణే మెట్రో జాప్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని విషయాలపై సమాచారం అందకపోవడమే కారణమని తెలిపారు. అయితే ఇప్పుడు అన్ని విషయాలపై సమాచారం లభించడంతో తొందర్లోనే ఆ ప్రాజెక్టు కూడా ప్రారంభమవుతుందని ప్రకటించారు.

ఈ కార్యక్రమం మరోల్‌లోని అంధేరీ-ఘాట్కోపర్ లింకు రోడ్డు (మరోల్ అగ్నిమాపక కేంద్రం) సమీపంలో జరిగింది. ఈ మెట్రో-3 ప్రాజెక్టును పూర్తిగా సొరంగాల ద్వారా భూగర్భంలో నిర్మిస్తారు. ఇది 2019 వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్టుకు సుమారు రూ.23,136 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. మెట్రో రాకతో ముంబైలో రవాణా వ్యవస్థ  మెరుగుపడనుంది. ఇప్పటికే ఘాట్కోపర్-వర్సోవా మధ్య మెట్రోరైలు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెట్రో-3 ప్రాజెక్టులో బాగంగా కొలాబా నుంచి సీప్జ్ వరకు మెట్రోరైలు మార్గాన్ని నిర్మించనున్నారు.

మరిన్ని వార్తలు