టికెట్ల బుకింగ్‌కు ఇక ఏజెంట్లతో పనిలేదు: గోయల్‌

14 Mar, 2020 06:22 IST|Sakshi

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు టికెట్ల కోసం ప్రైవేట్‌ విక్రేతలు, ఏజెంట్లపై ఆధారపడే అవసరం ఇకపై ఉండదని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో రైల్వే శాఖ గ్రాంట్ల డిమాండ్‌పై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన కొద్ది నిమిషాల్లోనే అక్రమమార్గాల్లో బుక్‌ చేసుకునే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్మార్ట్‌ఫోన్ల సాయంతో ప్రయాణికులే స్వయంగా టికెట్లను బుక్‌ చేసుకుంటున్నందున ఇకపై ఏజెంట్ల అవసరం లేకుండా చేస్తామన్నారు. సొంతంగా బుక్‌ చేసుకోలేని వారు ప్రభుత్వ కామన్‌ సర్వీస్‌ సెంటర్లకు వెళ్లవచ్చని తెలిపారు. రైల్వేల్లోకి ప్రైవేట్‌ భాగస్వామ్యంతో వచ్చే 12 ఏళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. 

మరిన్ని వార్తలు