ఢిల్లీలో ప్రైవేట్‌ కార్లపై నిషేధం!

31 Oct, 2018 08:42 IST|Sakshi
ఢిల్లీలో గాలి కాలుష్యం

సాక్షి,న్యూఢిల్లీ: పొరుగురాష్ట్రాల్లో గోధుమ గడ్డిని కాల్చడం పెరగడంతో ఢిల్లీలో కాలుష్య స్థాయి మంగళవారం ఉదయం మరింత అధికమై ఈ సీజన్‌లో అత్యధిక స్థాయికి చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఢిల్లీ మొత్తం మీద ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 397గా నమోదైంది. ఇది ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక స్థాయి. ఇది తీవ్ర స్థాయికి కేవలం మూడు పాయింట్లు మాత్రమే తక్కువగా ఉండడం గమనార్హం. నగరంలో 17 చోట్ల ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ తీవ్రంగా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు డేటా తెలిపింది.

గడిచిన 24 గంటల్లో గోధుమ గడ్డిని ఎక్కువగా తగలబెట్టడం, ప్రశాంతంగా వీస్తోన్న గాలి వల్ల నగరంలో కాలుష్యం మరింత అధికమైందని సిస్టం ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రీసర్చ్‌ (సఫర్‌) తెలిపింది. మంగళవారం పీఎం2.5 వల్ల కలిగిన కాలుష్యంలో 28 శాతం గోధుమగడ్డిని తగులబెట్టడం వంటి ప్రాంతీయ కారణాల వల్ల కలిగిందని సఫర్‌ తెలిపింది. మంగళవారం పీఎం 2.5 స్థాయి ఈ సీజన్‌లో అత్యధికంగా 251గా నమోదైంది. పీఎం 10 స్థాయి 453గా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు డేటా తెలిపింది. బుధ, గురువారాలలో కాలుష్యం మరింత పెరిగి , ఆ తరువాత తగ్గుతుందని సఫర్‌ తెలిపింది. 

కాలుష్యం తీవ్రమైతే కఠిన చర్యలు..
నగరంలో కాలుష్యం దృష్ట్యా అమలుచేస్తోన్న గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా నగరంలో కాలుష్య సమస్య మరింత ముదిరితే నవంబర్‌ 1 నుంచి ప్రైవేట్‌ కార్లపై నిషేధం విధించనున్నట్లు ఎన్విరాన్‌మెంట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ అథారిటీ (ఈపీసీఏ) చైర్మన్‌ భూరేలాల్‌ మంగళవారం తెలిపారు. ఢిల్లీలో కాలుష్యం మరింత దిగజారదని అశిద్దామని లేనట్లయితే నగరంలో ప్రైవేట్‌ కార్లపై నిషేధం విధించి, ప్రజా రవాణా వ్యవస్థను మాత్రమే ఉపయోగించవలసివస్తుందని భూరేలాల్‌ తెలిపారు.

సోమవారం లెప్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్, ఢిల్లీ పర్యావరణ మంత్రి ఇమ్రాన్‌ హుస్సేన్,ఈపీసీఏ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఎత్తైన భవనాల నుంచి నీరు చిలకరించడం, పారిశ్రామిక ప్రాంతాలలో నైట్‌ పెట్రోలింగ్‌ కోసం ఎన్విరాన్‌మెంట్‌ మార్షల్స్‌ని మోహరించడం,నిర్మాణ పనులపై నిషేధం విధించడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. 

>
మరిన్ని వార్తలు