ప్రైవేట్‌ స్కూళ్లలో పేదలకు 25% సీట్లు

2 Jul, 2019 03:42 IST|Sakshi

తప్పనిసరిగా ప్రవేశాలు కల్పించాలన్న కేంద్రం

బౌన్సర్లతో రుణ వసూళ్ల అధికారం బ్యాంకులకు లేదు

లోక్‌సభలో ప్రభుత్వం స్పష్టీకరణ

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ప్రైవేట్, ప్రత్యేక కేటగిరీ పాఠశాలల్లో 25 శాతం సీట్లను బలహీన వర్గాల వారి పిల్లలకు కేటాయించాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. బాలలకు ఉచిత, నిర్బంధ విద్య చట్టం–2010 ప్రకారం..ప్రాథమికోన్నత స్థాయి విద్య 6–14 ఏళ్ల మధ్య పిల్లలందరి ప్రాథమిక హక్కని తెలిపింది. అదేవిధంగా బౌన్సర్ల నియమించుకుని బలవంతంగా రుణ వసూళ్లు చేపట్టే అధికారం ఏ బ్యాంకుకూ లేదని తెలిపింది.

మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ నిశాంక్‌ సోమవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. అన్ని ప్రైవేట్‌ ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, స్పెషల్‌ కేటగిరీ పాఠశాలల్లో ఒకటి, అంతకంటే తక్కువ తరగతులకు చేపట్టే ప్రవేశాల్లో ఆ తరగతిలోని కనీసం 25 శాతం సీట్లను బలహీన, వెనుకబడిన వర్గాల వారి పిల్లలకు ఇవ్వాలి. ఆ తరగతి పూర్తయ్యే వరకు వారికి ఉచితంగా విద్య అందించాలి’ అని ఆయన కోరారు. ‘ఆ చిన్నారుల కయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రం నిర్ణయించిన ఫీజు ప్రకారం, లేదా వాస్తవంగా ఒక్కో చిన్నారి నుంచి వసూలు చేసే ఫీజు.. ఏది తక్కువైతే అందుకు సరిసమానమైన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది’ అని తెలిపారు. ప్రభుత్వం నుంచి భూమి, వసతి, పరికరాలను ఉచితంగా గానీ లేదా తక్కువ ధరకుగానీ పొంది 25 శాతం మంది చిన్నారులకు రిజర్వేషన్‌ ప్రకారం ఉచిత విద్య అందిస్తున్న పాఠశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండదని తెలిపారు.  

బౌన్సర్లతో వసూళ్లు వద్దు:
బలవంతంగా రుణాలను వసూలు చేసుకునేందుకు గాను ఏ బ్యాంక్‌కు కూడా బౌన్సర్లను నియమించుకునే అధికారం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు.  ‘ఆమోదించిన మార్గదర్శకాల మేరకే రుణ వసూళ్లు చేపట్టాలి. రుణ గ్రహీతపై దౌర్జన్యం చేయడం, ఇబ్బందులు పెట్టడాన్ని ఆర్‌బీఐ నిషేధించింది. పోలీసుల ధ్రువీకరణ, అవసరమైన ఇతర అర్హతలు పొందిన తర్వాత మాత్రమే బ్యాంకులు రికవరీ ఏజెంట్లను నియమించుకునేందుకు ఆర్‌బీఐ వీలు కల్పించింది’ అని తెలిపారు.  

టీచర్స్‌ కోటా బిల్లుకు ఆమోదం
కేంద్ర విద్యాసంస్థలు (టీచర్స్‌ కేడర్‌ బిల్లు–2019) బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. దేశవ్యాప్తంగా 41 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో 8వేల పోస్టుల భర్తీకి అమలయ్యే రిజర్వేషన్ల విషయంలో డిపార్టుమెంట్‌ను యూనిట్‌ను కాకుండా యూనివర్సిటీని యూనిట్‌గా పరిగణించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం తెచ్చిన చట్టం కూడా అమలవుతుంది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే ఆర్డినెన్స్‌ స్థానంలో అమలవుతుంది.

మరిన్ని వార్తలు