ఇక ప్రైవేటు రంగంలో విమానాల తయారీ

20 Jul, 2014 01:13 IST|Sakshi

రవాణా విమానాల ప్రాజెక్టుకు మోడీ సర్కారు గ్రీన్‌సిగ్నల్
దేశీయ ప్రైవేట్ రంగ కంపెనీలకు మాత్రమే అనుమతి
 రూ. 21 వేల కోట్ల విలువైన రక్షణ ప్రాజెక్టులకూ ఆమోదం

 
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రంగానికి సంబంధించిన రూ. 21 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. కీలకమైన రవాణా విమానాల తయారీ ప్రాజెక్టుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీన్ని చేపట్టేందుకు దేశీయ ప్రైవేటు రంగ కంపెనీలను మాత్రమే అనుమతించింది. ప్రభుత్వ రంగానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌భాగస్వామ్యం లేకుండా ప్రైవేటురంగంలో విమానాల తయారీకి ప్రభుత్వం ఆమోదం తెలపడం ఇదే తొలిసారి. శనివారం రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏసీ ఆమోదం తెలిపిన కీలక ప్రతిపాదనల్లో ఎక్కువ శాతం.. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్  రంగ కంపెనీలకే అనుమతులు ఇవ్వడం గమనార్హం. రక్షణ పరికరాల తయారీలో స్వదేశీ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంది.

56 రవాణా విమానాల తయారీకి ప్రైవేటు కంపెనీల నుంచి టెండర్లు పిలవాలన్న  వాయుసేన(ఐఏఎఫ్) ప్రతిపాదనలకు డీఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటు రంగంలోని కంపెనీలకు మాత్రమే ఈ ప్రాజెక్టులో అవకాశం కల్పించడం వల్ల వాటి సామర్థ్యాన్ని పెంపొందించేలా చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదనల ప్రకారం.. దేశంలో రక్షణ రంగానికి చెందిన ప్రైవేటు కంపెనీలైన టాటా, మహీంద్రా తదితర సంస్థలు టెండర్లు వేసి విదేశీ కంపెనీల భాగస్వామ్యంతో విమాన్చాజీ తయారు చేయొచ్చు. రూ. 20 వేల కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు కింద 16 రవాణా విమానాలను విదేశీ భాగస్వామ్యంతో..  40 విమానాలను భారత్‌లో తయారు చేయాలి. నౌకాదళం కోసం రూ. 9 వేల కోట్ల విలువైన 5 విమానవాహక నౌకలను అందించడానికి టెండర్లను పిలిచేందుకు డీఏసీ ఆమోదం తెలిపింది. నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బందికి రూ. 7 వేల కోట్ల వ్యయంతో 32 అత్యాధునిక తేలికపాటి ధ్రువ్ హెలికాఫ్టర్లను అందించే ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఇందులో 16 హెలికాఫ్టర్లను హెచ్‌ఏఎల్ సప్లై చేస్తుంది.  రూ. 2,360 కోట్ల వ్యయంతో ఐదు  గస్తీ నౌకలులు, తీర ప్రాంత గస్తీ నౌకలను కోస్ట్ గార్డ్‌కు అందించే ప్రతిపాదనకు ఆమోదించింది. త్రివిధ దళాలకు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ల పరికరాల కొనుగోలుకు ఉద్దేశించిన రూ. 900 కోట్ల ప్రాజెక్టుకూ గ్రీన్‌సిగ్నల్ లభించింది. స్కార్‌పీన్ సబ్‌మెరైన్ల డెలివరీకి సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ను కూడా డీఏసీ ఆమోదం తెలిపింది.
 
 

మరిన్ని వార్తలు